మహ్మద్ షమీ మధుర జ్ఞాపకం.. తొలి మ్యాచ్‌లో 14 సిక్స్‌లు.. కింగ్స్ పంజాబ్ ట్వీట్!

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ నేడు 30వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సహచర క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అతనికి విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ షమీకి చెందిన ఓ మధుర జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది. భారత జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే కీలక పేసర్‌గా ఎదిగిన షమీ.. తన తొలి మ్యాచ్‌లో బ్యాట్‌తో సత్తాచాటాడని, ఏకంగా 14 సిక్సర్లు బాధడాని పేర్కొంది. పదునైన స్వింగర్లతో బ్యాట్స్‌మెన్‌ను కంగారు పెట్టించే షమీ ఆడిన తొలి మ్యాచ్‌లోనే 14 సిక్సర్లు బాదాడంటే నమ్మశక్యంగా లేకున్నా.. అది కూడా అనుకోకుండా వచ్చిన అవకాశంతోనని చెప్పడం.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజమని షమీనే చెప్పుకొచ్చాడు.

అనుకోకుండా చాన్స్..
‘ఓ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో నా సోదరుడు హసీబ్ ఆడే జట్టులో ఒక ఆటగాడు తక్కువయ్యాడు. దాంతో నాకు తొలి అవకాశం వచ్చింది. అతని స్థానంలో బ్యాటింగ్ చేయాలని చెప్పాడు. అప్పటికీ నాకు సీజన్ బంతితో ఆడిన అనుభవం లేదు. టెన్నిస్ బాల్‌తోనే క్రికెట్ ఆడేవాడిని. నిజం చెప్పాలంటే సీజన్ బాల్‌తో ఆడటం నాకు భయం. అయినా వినకుండా నా సోదరుడు ఆడాలని పట్టుబట్టాడు. టెన్నిస్ బంతిని కొట్టినట్టే ఇక్కడా సీజన్ బంతిని కొట్టమని సలహా ఇచ్చాడు.

14 సిక్సర్లు బాదా..
నేను జిల్లా స్థాయి క్రికెట్ ఆడటం.. బ్యాటింగ్ చేయడం అదేతొలిసారి. ఫస్ట్ బాల్‌నే బౌండరీ ధాటించడంతో ఆడగలననే నమ్మకం వచ్చింది. అలాగే బ్యాటింగ్ చేస్తూ రెచ్చిపోయా. ఆ మ్యాచ్‌లో మొత్తం 14 సిక్సర్లు బాదాను. ఆ మ్యాచ్‌తోనే నాకు క్రికెట్‌పై ఆసక్తి కలిగింది. ఆ తర్వాత వారసత్వంగా ఉన్న బౌలింగ్‌నే కెరీర్‌గా మలుచుకున్నా'అని షమీ కింగ్స్ పంజాబ్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.

బీసీసీఐ, ఐసీసీ ట్వీట్..
మరోవైపు, షమీ పుట్టిన రోజు సందర్భంగా అతడికి పలువురు క్రికెటర్లు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే ఐసీసీ, బీసీసీఐ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి. ఈ సందర్భంగా ఐసీసీ గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అతడు అఫ్గనిస్థాన్‌పై హ్యాట్రిక్ సాధించిన వీడియోను షేర్ చేయగా.. బీసీసీఐ మాత్రం దక్షిణాఫ్రికాతో ఒక వన్డేలో ఐదు వికెట్లు తీసిన వీడియోను ట్వీట్ చేసింది. 2013లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన షమీ అప్పటి నుంచి ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2015, 2019 వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలిచాడు. అనతికాలంలోనే అగ్రశ్రేణి బౌలర్‌గా ఎదిగిన షమీ ఇప్పటి వరకూ 49 టెస్టులు, 77 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లాడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 336 వికెట్లు పడగొట్టాడు.

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు..
క్రికెట్ కెరీర్ పరంగా దూసుకుపోతున్న మహ్మద్ షమీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం గత రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాడు. అతని భార్య హసీన్ జహాన్.. రెండేళ్ల క్రితం అతనిపై గృహ హింస కేసు పెట్టడంతో పాటు అక్రమ సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. దీంతో హసీన్‌కు షమీ దూరంగా ఉంటున్నాడు .అయినా షమీపై ఆమె తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉంది. షమీ మాత్రం మౌనంగా ఉండిపోతూ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ వ్యక్తిగత ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని, తన కుటుంబం అండగా నిలిచిందని ఈ భారత పేసర్ తెలిపిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ క్రికెట్‌లోని జాతి, మత వివక్షతో చావాలనుకున్నా: పాక్ సంతతి క్రికెటర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications