ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో క్రికెట్ మక్కా లార్డ్స్ మైదానం వేదికగా ఈ బిగ్ మ్యాచ్‌కు తెరలేవనుంది. గత రెండెళ్లుగా సాగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో టాప్-2లో నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఈ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జూన్ 11 నుంచి 15 వరకు జరిగే ఈ మ్యాచ్‌కు జూన్ 16ను రిజర్వ్ డేగా కేటాయించారు.
వర్షం లేదా ఇతర కారణాల వల్ల నష్టపోయిన ఆటను రిజర్వ్ డే రోజు ఆడిస్తారు. డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో భారత్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా.. వరుసగా రెండో టైటిల్ గెలవడంపై ఫోకస్ పెట్టింది. మరోవైపు తొలిసారి ఫైనల్ చేరిన సౌతాఫ్రికా మొట్ట మొదటి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇరు జట్లు ఇంగ్లండ్ చేరి ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

అయితే ఈ మ్యాచ్ డ్రా అయితే పరిస్థితి ఏందనేది చాలా మంది నెటిజన్లలో ఓ సందేహం నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లు టైటిల్‌ను షేర్ చేసుకోనున్నాయి. డబ్ల్యూటీసీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఫైనల్ మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు. టెస్ట్ క్రికెట్ ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో 2019లో ఐసీసీ ఈ ఛాంపియన్‌షిన్‌ను ప్రవేశ పెట్టింది. వరుసగా రెండు ఎడిషన్లలో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. డబ్ల్యూటీసీ 2021తో పాటు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ చేరింది. కానీ రెండు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఓటమే ఎదురైంది. తొలి టైటిల్‌ను న్యూజిలాండ్ గెలవగా.. రెండో టైటిల్‌ను ఆసీస్ కైవసం చేసింది. వరుసగా మూడో సారి ఫైనల్ చేరే అవకాశాన్ని భారత్ చేజేతులా చేజార్చుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-4తో కోల్పోయి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోలేకపోయింది.
ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు 101 మ్యాచ్‌లు ఆడాయి. 54 విజయాలతో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. సౌతాఫ్రికా 26 మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో 21 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు లేదు. ఐదు రోజుల పాటు ఆట సజావుగా సాగనుంది. కవేళ వర్షంతో అంతరాయం కలిగినా.. రిజర్వ్ డే ఉంది. వాతావరణం వేడిగా ఉంటే మాత్రం స్పిన్నర్లు కీలకంగా మారనున్నారు. చల్లగా ఉంటే సీమర్లు చెలరేగుతారు. పిచ్‌పై పచ్చదనం ఉండటంతో పాటు మైదానాన్ని మబ్బులు కమ్మెస్తే టాస్ గెలిచిన కెప్టెన్‌గా బౌలింగ్ ఎంచుకుంటాడు. అలా కాకుండా వాతావరణం వెచ్చగా ఉంటే మాత్రం బ్యాటింగ్‌కు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో చివరి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.