విరాట్ కోహ్లీ జాతకం ఎలా ఉందంటే? భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే?
ప్రపంచ క్రికెట్‌లో బ్యాటర్లంతా ఒకవైపు.. విరాట్ కోహ్లీ ఒక్కడే ఒక వైపు.. కొన్నెళ్ల క్రితం అతడి మాటలో మాత్రమే దూకుడెక్కువ అన్న వాళ్లకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. క్రీజులోకి వచ్చి ప్రత్యర్థులకు దడ పుట్టించాడు.. ఎంతలా అంటే 'మనం తప్పు చేయడానికి వీల్లేదు జాగ్రత్త... క్రీజ్‌లో కోహ్లీ ఉన్నాడు..! అని ప్రతి కెప్టెన్ భయపడేంతా.. ఒకప్పుడు సచిన్.. ఇప్పుడు కోహ్లీ అని అందరూ చెప్పుకునేంతా..!
ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ఈ తరం చూసిన అత్యుత్తమ బ్యాటర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. భారత క్రికెట్ ముఖచిత్రంగా ఎదిగిన విరాట్ కోహ్లీ.. ఆటగాడిగా చివరి దశకు చేరుకున్నాడు.
అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఒకే ఫార్మాట్ ఆడుతుండటంతో గతంలోలానే నిలకడగా రాణిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కోహ్లీకి సంబంధించిన ఏ విషయమైనా ఆసక్తికరంగా మారుతోంది. కెరీర్ చివరి దశలో ఉన్న కోహ్లీ జాతక చక్రం ఎలా ఉందో.. అతని భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..? ఓ లుక్కెద్దాం.

కోహ్లీ జాతక చక్రం..
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం విరాట్ కోహ్లీది కన్యా రాశి. ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ధనూలగ్నం. కోహ్లీ లగ్నంలో శని ఉండటం వల్ల అతనికి అత్యంత క్రమశిక్షణ, కఠిన శ్రమ, ఎంతకైనా తెగించే పట్టుదల అలవడ్డాయి. రాహువు ఉండటం వల్ల ధైర్య సాహసాలు, లౌక్యం, క్రీడారంగంలో అద్భుతమైన సక్సెస్ సొంతమైంది. 2011 నుంచి 2029 వరకు విరాట్ కోహ్లీ జాతకంలో రాహు మహాదశ కొనసాగుతోంది.
ఈ దశలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో పాటు అతని రికార్డుల పరంపర కొనసాగింది. ప్రస్తుతం నడుస్తున్న శుభ గ్రహాల అంతర్దశల వల్ల అతను అంతర్జాతీయ స్థాయిలో మరికొన్ని గొప్ప మైలురాళ్లను సాధించే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం వల్ల మధ్యలో ఫిట్‌నెస్ సమస్యలతో పాటు ఒత్తిడి, ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ తన ఫిట్‌నెస్ క్రమశిక్షణతో వాటిని అధిగమిస్తాడు.
భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే..?
2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆటగాడిగా కొనసాగేందుకు విరాట్ కోహ్లీకి ఎలాంటి అడ్డంకులు లేవు. 2028-29 తర్వాత కోహ్లీ జాతకంలో రాహు మహాదశ ముగిసి గురు మహాదశ మొదలవుతుంది. గురుడు లగ్నాధిపతి కావడం వల్ల అతని జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.
ఆ సమయంలో అతను కోచ్‌గా కెరీర్ ప్రారంభించడం లేదా పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారే అవకాశం ఉంది. మెంటారిషిప్, కోచింగ్, స్పోర్ట్స్ అకాడమీలను నడిపించడం లేదా వ్యాపారం, బ్రాండింగ్ రంగాల్లో మరింత చురుగ్గా మారి నాయకత్వ పాత్రలు పోషించవచ్చు.
వయస్సు పెరిగే కొద్దీ ఆధ్యాత్మిక భావాలు..
కోహ్లీ జాతకంలో గ్రహాల పొజిషన్ బాగుండటం వల్ల అతనికి డబ్బు కొదవే ఉండదు. పెట్టిన పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు వస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి, వాటిని ఇంకా పెద్ద ఎత్తున విస్తరించే అద్భుతమైన అవకాశం ఉంది. వయసు పెరిగే కొద్దీ దైవచింతన, ధ్యానం వైపు అతని మనసు మళ్లుతుంది.
సమాజానికి సహాయం చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి వాటిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. విరాట్ కోహ్లీ జాతక చక్రం ప్రకారం ఆటగాడిగానే కాకుండా.. భవిష్యత్తులో మార్గదర్శకుడిగా, ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా సుదీర్ఘకాలం తన ప్రభావాన్ని చూపించనున్నాడు.
డిస్క్లేమర్: ఈ కథనంలో చెప్పిన విరాట్ కోహ్లీ జాతకం, జ్యోతిష్య వివరాలు ఇంటర్నెట్‌లో లభించిన సమాచారంతో రాసాం. ఈ జాతకానికి మైఖేల్ తెలుగు వెబ్‌సైట్‌కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం పాఠకుల ఆసక్తి, సమాచారం కోసం మాత్రమే రాయడం జరిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


