ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో నెపాల్ పోరాటం ముగిసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. గ్రూప్-సీలో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌తో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో నెపాల్ 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
జాసన్ హోల్డర్(4/27) అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో నెపాల్ పతనాన్ని శాసించాడు. హ్యాట్రిక్ విజయంతో గ్రూప్-సీ నుంచి వెస్టిండీస్ సూపర్-8 బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. దీపేంద్ర సింగ్(47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. సోంపాల్ కామి(15 బంతుల్లో 4 ఫోర్లతో 26 నాటౌట్) పర్వాలేదనపించాడు.

వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ నాలుగు వికెట్లు తీయగా.. అకీల్ హొస్సేన్, మాథ్యూ ఫోర్డ్, షెమర్ జోసెఫ్, రోస్టన్ ఛేజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం వెస్టిండీస్ 15.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 134 పరుగులు చేసి గెలుపొందింది. షైహోప్(44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్)టాప్ స్కోరర్‌గా నిలిచారు. నేపాల్ బౌలర్లలో నందన్ యాదవ్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్, ఇటలీ చేతిలో ఓడిన నేపాల్..తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను స్కాట్లాండ్‌తో ఆడనుంది. మరోవైపు నేపాల్‌తో పాటు ఇంగ్లండ్, స్కాట్లాండ్‌ను ఓడించిన వెస్టిండీస్ ఇటలీ మ్యాచ్‌తో సంబంధం లేకుండా సూపర్-8 బెర్త్ దక్కించుకుంది. గ్రూప్-సీ నుంచి రెండో జట్టుగా సూపర్-8 బెర్త్ దక్కించుకునేందుకు ఇంగ్లండ్ సిద్దంగా ఉంది.