
న్యూఢిల్లీ: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో భారత పేసర్లకు చోటు దక్కలేదు. క్రికెట్ చరిత్రలో తరాలతో సంబంధం లేకుండా నలుగురు అత్యుత్తమ పేసర్లను ఎంపిక చేసిన హోల్డింగ్ ఆ వివరాలను బుధవారం ప్రకటించాడు. అందులో మల్కమ్ మార్షల్, ఆండీ రాబర్ట్స్, డేనిస్ లిల్లీతో పాటు సాతాఫ్రికా దిగ్గజ బౌలర్ స్టెయిన్‌ను చేర్చాడు.
మల్కమ్, ఆండీ వెస్టిండీస్ పేస్ దిగ్గజాలు కాగా.. లిల్లీ ఆస్ట్రేలియా ప్లేయర్. ఈ ముగ్గురితో కలిసి ఆడిన హోల్డింగ్.. స్టెయిన్ బంతులను ప్రత్యక్షంగా ఎదుర్కోకపోయినా.. అతడు ప్రపంచ అత్యుత్తమ పేసర్ అని పేర్కొన్నాడు. 'ఈ ముగ్గురు (మార్షల్, రాబర్ట్స్, లిల్లీ)తో కలిసిన ఆడిన అనుభవం నాకుంది. స్టెయిన్‌తో కలిసి ఆడనప్పటికీ అతడు అత్యుత్తమ పేసర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత తరంలో అతడు అత్యుత్తమ పేసర్ అని నా అభిప్రాయం అని హోల్డింగ్ పేర్కొన్నాడు.
ఇక లిల్లీ కెరీర్ ఆరంభంలో దూకుడు,రిథమ్‌తో అత్యంత వేగంగా బంతులు విసిరేవాడని హోల్డింగ్ గుర్తు చేసుకున్నాడు. అయితే లిల్లీ వెన్ను గాయంతో తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకున్నాడని తెలిపాడు. మాల్క్‌లమ్ బౌలింగ్ కూడా చాలా వేగంగా ఉండేదని, విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌ను త్వరగా ఔట్ చేశేవాడని ఈ విండీస్ దిగ్గజం తెలిపాడు. ఇక అండీ నుంచి తానేంతో నేర్చుకున్నానని, అతను అద్భుతమైన పేసరే కాకుండా తన రూమ్‌మెట్ అని హోల్డింగ్ చెప్పుకొచ్చాడు.