టీమిండియాలో సూపర్‌స్టార్ కల్చర్‌ను ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. క్రికెటర్లు.. యాక్టర్లు కాదని, వారిని సూపర్‌స్టార్స్‌లా ట్రీట్ చేయవద్దని సూచించాడు. టీమిండియాలో సూపర్ స్టార్ కల్చర్‌కు తెరదించేందుకు బీసీసీఐ గత నెలలో 10 పాయింట్ గైడ్‌లెన్స్‌తో ఓ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశీ పర్యటనలకు కుటుంబ సభ్యులను అనుమతించడంపై ఆంక్షలు విధించింది.
45 రోజులకు పై ఉన్న పర్యటనలోనే కుటుంబ సభ్యులను అనుమతిస్తామని, అది కూడా రెండు వారాలకు మించి ఉండవద్దని పేర్కొంది. మూడు వారాల్లోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగియనుండటంతో టీమిండియా ఆటగాళ్లు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లే వెసులుబాటు లేకుండా పోయింది.

వ్యక్తి పూజ వద్దు..
ఈ వ్యవహారంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. భారత క్రికెట్‌లో వీలైనంత త్వరగా సూపర్ స్టార్ కల్చర్‌కు తెరదించాలన్నాడు. 'భారత్ క్రికెట్‌లో పరిస్థితులన్నీ సాధారణంగా మార్చడం అత్యంత ముఖ్యం. జట్టులో సూపర్ స్టార్‌డమ్, సూపర్ సెలెబ్రిటీస్ కల్చర్‌ను ఏ మాత్రం పోత్సహించవద్దు. ముందు ముందు పరిస్థితులన్నీ సాధారణం చేయాలి. మనం క్రికెటర్లం. యాక్టర్స్, సూపర్ స్టార్స్ ఏమాత్రం కాదు. మనమంతా క్రీడాకారులం. సామన్య ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారు మనతో పోల్చుకునేలా వ్యవహరించాలి.
వ్యక్తిగత రికార్డులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవద్దు. ఉదాహరణకు మీరు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించి ఉంటే.. మీరు మరో శతకం సాధిస్తే అది గొప్ప మైలురాయిగా భావించవద్దు. ఈ ఘనతల కంటే గొప్ప లక్ష్యాలు పెట్టుకొని ఆడాలి.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టులో చేసిన మార్పులపై అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 15 మంది జట్టులో ఐదుగురు స్పిన్నర్లు ఎందుకని ప్రశ్నించాడు. భారత సెలెక్టర్ల నిర్ణయం తనకు అర్థం కాలేదని చెప్పాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్ కోసం యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను జట్టులో నుంచి తప్పించడం సరికాదన్నాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడం లేదని, ఐఎల్ టీ20లో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.