బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. చెపాక్ పిచ్‌కు అనుగుణంగా లెక్కలతో కూడిన బ్యాటింగ్ చేయలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై తప్పుకుంది. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా ముంబై ఇండియన్స్ ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. మూడు విభాగాల్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందని చెప్పాడు. ఈ మ్యాచ్‌తో పాటు ఈ సీజన్ మొత్తం తమకు కలిసి రాలేదన్నాడు. 'కేవలం ఈ రాత్రి మాత్రమే కాదు. ఈ సీజన్ మొత్తం మాకు కలిసిరాలేదు. సీఎస్‌కే మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. మూడు విభాగాల్లో అదరగొట్టింది. ఈ పిచ్‌పై 180-190 పరుగుల మంచి స్కోర్. ఓ దశలో మేం ఆ స్కోర్ చేయగలమని భావించాం.
అది మంచి స్కోరు అయ్యేది, కానీ 10 ఓవర్ల తర్వాత మేం దూకుడుగా ఆడలేకపోయాం. క్రీజులోకి రాగానే భారీ షాట్స్ ఆడటం ఇక్కడ అంత సులువు కాదు. చెన్నై బ్యాటర్లు కూడా సెట్ అయిన తర్వాత కూడా భారీ షాట్స్ ఆడలేకపోయారు. ఇక్కడ లెక్కలతో కూడిన క్రికెట్ ఆడటం, చేతిలో వికెట్లు ఉంచుకోవడం కీలకం. ఆ లెక్కను మేం తప్పాం.

అదే సమయంలో మా బ్యాటర్లు బంతిని సరిగ్గా హిట్ చేయలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేశారు. బౌలింగ్‌లో వారు అదరగొడితే.. బ్యాటింగ్‌లో మేం విఫలమయ్యాం. బౌలింగ్‌లో ఇంకా ఎంత దూకుడుగా ఉండాలి? బహుషా వారిని ఔట్ చేయడానికి మేం నిప్పులు కురిపించే బంతులు వేయాలేమో(నవ్వుతూ). మాకున్న బౌలింగ్ వనరులతో మేం ప్రయత్నించాం. కానీ వారు తెలివిగా బ్యాటింగ్ చేశారు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధీర్(37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్(3/32) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ తలో వికెట్ తీసారు.
అనంతరం సీఎస్‌కే 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్), కార్తీక్ శర్మ(40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఉర్విల్ పటేల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) దూకుడుగా ఆడాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, అల్లా ఘజన్‌ఫర్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.