ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నీకి తెరలేవనుండగా.. సెప్టెంబర్ 14న దాయాదీ దేశాలు తలపడనున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత భారత్, పాకిస్థాన్‌లు తలపడనుండటం ఇదే తొలిసారి.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌తో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఒకానొక దశలో యుద్దం జరిగే పరిస్థితులు కనిపించాయి. కానీ ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఇరు దేశాల మధ్య భారీగానే ప్రాణ నష్టం జరిగింది.

ఈ క్రమంలోనే పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దనే వాదన గట్టిగా వినిపించింది. ఈ క్రమంలోనే వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్‌షిప్ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ బహిష్కరించింది. చివరకు సెమీఫైనల్ కూడా ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆసియా కప్ 2025లో కూడా పాకిస్థాన్‌తో భారత్ ఆడదని అంతా అనుకున్నారు. కానీ పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతిచ్చింది. పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం.. మల్టీ నేషనల్ టోర్నీల్లో ఆడవచ్చని పేర్కొంది. అంతేకాకుండా పాక్‌లో పర్యటించడం.. భారత్‌కు ఆ జట్టు రావడం కూడా ఉండదని పేర్కొంది.
ఆసియా కప్ 2025లోని భారత్-పాక్ మ్యాచ్‌ను ఉద్దేశించి అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ టీవీ ప్రోమోను విడుదల చేసింది. భారత్-పాక్ మధ్య పోరు కేవలం క్రికెట్ మ్యాచ్ కాదని, అది రెండు దేశాల ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఒక గొప్ప ఘట్టం అని ఈ ప్రోమోలో చూపించింది. పాక్‌తో మ్యాచ్ అంటే భారత్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో.. దేశం మొత్తం ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతుందనే కాన్సెప్ట్‌ను Rag Rag Mein Bharat అనే పాటతో చూపించారు. ఈ ప్రోమోలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నాడు.
ఈ ప్రొమోపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్, పాక్ మ్యాచ్‌ను ఎవరూ చూడవద్దని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. జవాన్ల మరణం కంటే బీసీసీఐ, సోనీ టీవీకి డబ్బులే ముఖ్యమయ్యాయని మండిపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని తాము మరిచిపోమని, ఆసియా కప్‌ను బాయ్‌కట్ చేయాలని పిలుపునిస్తున్నారు. భారత్, పాక్ మ్యాచ్‌తో బీసీసీఐ.. జవాన్ల శవాలపై చిల్లర ఏరుకునే ప్రయత్నం చేస్తుందని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు పాక్ సైనికులు, ఉగ్రవాదులు దేశ ప్రజలు, సైనికుల ప్రాణాలు తీస్తుంటే.. ఆ జట్టుతో క్రికెట్ ఆడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు భారత్, పాక్ మ్యాచ్ మధ్య ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ టీవీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే యాడ్ రేట్స్‌ను భారీగా పెంచేసింది. 10 సెకన్ల యాడ్‌కు రూ. 16 లక్షలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. భారత్, పాక్ మ్యాచ్‌కు ఈ ధర మరింత ఎక్కువగా ఉంటుందని అడ్వర్టైజింగ్ వర్గాలు పేర్కొన్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌ను బాయ్‌కట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తుండటంతో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌లో కలవరపాటు మొదలైంది. బాయ్‌కట్ క్యాంపైన్ భారీ ఎత్తున జరిగితే సోనీ నెట్‌వర్క్‌కు భారీ నష్టాలు ఏర్పడనున్నాయి.