
బర్మింగ్‌హామ్: టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ (55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117) మెరుపు సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో టీ20లో టాపార్డర్, మిడిలార్డర్, లోయరార్డర్ కట్టకట్టుకోని విఫలమైన వేళ సూర్య.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విధించిన కొండంత లక్ష్యాన్ని చేధించినంత పని చేశాడు. చివర్లో ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔటవ్వడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచి పరువు కాపాడుకుంది. సూర్య ప్రతాపానికి ఒక్కడు తోడైనా మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కొద్దిసేపు శ్రేయస్ అయ్యర్ (28) అండగా నిలిచినా... మరెవరూ సహకరించలేదు.
అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. సూర్య ఆడిన విధానాన్ని అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. అతని అమ్ములపొదిలో ఉన్న విభిన్నమైన షాట్స్ చూసి నోరెళ్ల బెట్టారు. ఎలాంటి బంతులనైనా అలవోకగా బౌండరీలకు తరలిస్తుంటే చూసి ముచ్చటపడ్డారు. మైదానం నలువైపులా అతను ఆడిన షాట్స్.. 360 ప్లేయర్‌కు అమ్మ మొగుడైన ఏబీ డివిలియర్స్ కూడా ఆడలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా చెలరేగాడు సూర్య.
సూర్య వినూత్న షాట్స్‌కు అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. అతని 360 షాట్స్‌కు సంబంధించిన మీమ్‌ను షేర్ చేస్తూ.. సూర్య ఆటకు సలామ్ కొడుతున్నారు. మీమ్స్ కాదు సూర్య షాట్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సూర్య.. బ్రాండ్ ఆఫ్ 360 ప్లేయరని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఈ తరం క్రికెట్‌లో రాణించాలంటే సూర్యలా విభిన్నమైన షాట్స్ ఆడాలని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), లివింగ్‌స్టోన్ (29 బంతుల్లో 42 నాటౌట్; 4 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ పేసర్ రీస్ టోప్లే (3/22) 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు గెల్చుకోగా... భువనేశ్వర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' పురస్కారం లభించింది.