భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ సాధికారికంగా ఆడుతోంది. 21/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ 117/0 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బెన్ డకెట్(64 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలీ(42 బ్యాటింగ్) అర్ధ శతకానికి చేరువయ్యాడు. ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. ఇంగ్లండ్ విజయానికి 254 పరుగులు కావాలి. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.
ఐదో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను రిషభ్ పంత్ నేలపాలు చేశాడు. జాక్ క్రాలీ ఇచ్చిన కష్టతరమైన రిటర్న్ క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోయాడు. అయితే ఐదో రోజు ఆట ఆరంభంలో తమ బౌలింగ్ స్పెల్‌ను ఉద్దేశించి శుభ్‌మన్ గిల్ అన్న మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి.' ఓవైపు మహమ్మద్.. మరోవైపు కృష్ణ.. ఇద్దరు కలిసి విధ్వంసం సృష్టిస్తారు'అని గిల్ హిందీలో అన్నాడు. ఆ సమయంలో ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌లు బౌలింగ్ చేస్తున్నారు. వారి స్పెల్‌ను ఉద్దేశించి గిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ గిల్ అన్నట్లుగా ఈ ఇద్దరూ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు.

రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారత బౌలర్లు చెలరేగాలి. లేదంటే ఇంగ్లండ్ సునాయసంగా లక్ష్యాన్ని చేధిస్తోంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యం నమోదైంది.