
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా మహిళా పేసర్ శిఖా పాండే అవాక్కయ్యే బంతితో ఔరా అనిపించింది. ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆమె వేసిన స్వింగ్ బాల్ అందర్ని ఆశ్చర్యపరిచింది. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి ఒక్కసారిగా టర్న్ అయి మిడిల్ స్టంప్‌ను ఎగరగొట్టింది. నాగుపాములా దూసుకొచ్చిన బంతికి ఆస్ట్రేలియా బ్యాటర్ అలీసా హీలీ బిత్తరపోయింది. క్రికెట్‌లో ఇలాంటి బాల్స్ కూడా ఉంటాయా? అని ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. మహిళా క్రికెట్‌లో బాల్ ఆఫ్ ద సెంచరీ అంటూ నెటిజన్లు శిఖాపాండేను ప్రశంసింస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్బంగా.. శిఖా పాండే వేసిన ఫస్ట్ ఓవర్ రెండో బంతికే అలీసా హీలీ ఔటైంది. అనూహ్యంగా స్వింగ్ అయిన బంతికి హీలీ(4) ఏం చేయలేక పెవిలియన్ చేరింది. శిఖా పాండే బౌలింగ్‌ను అభిమానులతో సహా మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. ట్విటర్ వేదికగా కొనియాడుతున్నారు.'శిఖా పాండే ఒక అద్భుతం.. మహిళా క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీ'అంటూ వసీం జాఫర్ ఈ వీడియోను ట్వీట్ చేశాడు.
అయితే ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. భారత మహిళల జట్టులో పుజా వస్త్రాకర్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 నాటౌట్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు స్మృతి మంధాన(1), షెఫాలీ వర్మ(3), జెమీమా రోడ్రిగ్స్(7), యష్తికా భాటియా(8), రిచా ఘోష్(2), దీప్తి శర్మ(16) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ మహిళలు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 119 పరుగులు చేసి 5 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. ఆస్ట్రేలియా జట్టులో బెత్ మూనీ(34), తహిలా మెక్‌గ్రాత్(42 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ మూడు వికెట్లు తీయగా.. శిఖా పాండే, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్ టీ20 వర్షం కారణంగా అర్థంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించడంతో పాడు ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.