
కరాచీ: పాకిస్థాన్ దేశవాళీ టోర్నీ నేషనల్ టీ20 కప్‌లో ఆ దేశ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. అచ్చం చేపపిల్లలానే డైవ్ చేసి ఔరా అనిపించాడు. వికెట్ కీపర్ అయిన రిజ్వాన్.. గ్లోవ్స్ లేకుండానే ఫీల్డర్‌గా బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఈ సూపర్ క్యాచ్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం అవాక్కైంది. క్యాచ్ ఆఫ్ ది ఇయర్‌గా కొనియాడుతుంది.
పాక్ డొమెస్టిక్ టీ20 టోర్నీలో భాగంగా మంగళవారం సింధ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖైబర్ ఫక్తున్‌క్వా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 28 ఏళ్ల రిజ్వాన్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. సింధ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ అద్భుత విన్యాసం చోటుచేసుకుంది. సింధ్ విజయానికి చివరి 12 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ సమయంలో బ్యాట్స్‌మన్ అన్వర్ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించగా బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోని నాన్ స్ట్రైకింగ్‌కు దగ్గర్లోనే గాల్లోకి లేచింది. వాస్తవానికి బౌలర్‌కు బంతి అందుకునేందుకు అవకాశం ఉన్నా అతను క్యాచ్ కోసం ప్రయత్నించలేదు. దాంతో ఎక్స్‌ట్రా కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రిజ్వాన్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి గాల్లో డైవ్ చేసి ఆ బంతిని అందుకున్నాడు. టోర్నమెంట్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్ అని పాక్ క్రికెట్ బోర్డుతో పాటు ఆదేశ మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఐసీసీ కూడా ట్వీట్ చేసింది. 'వాటే క్యాచ్ మహ్మద్ రిజ్వాన్'అని ప్రశంసించింది. దాంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
అయితే రిజ్వాన్ సూపర్ క్యాచ్ పట్టినా సింధ్ విజయం మాత్రం ఆగలేదు. ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన క్రమంలో డానిష్ అజిజ్ భారీ సిక్స్ కొట్టి అద్భుత విజయాన్నందించాడు. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సింధ్.. 8వ ఓవర్‌లోనే 34 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అజిజ్, అన్వర్ అలీ 8వ వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇక రిజ్వాన్ సూపర్ క్యాచ్‌కు అన్వర్ అలీ వెనుదిరిగినా..అజిజ్ విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సి ఉండగా.. అజిజ్ చివరి మూడు బంతుల్లో సిక్స్, ఫోర్, సిక్స్ కొట్టి సూపర్ విక్టరీని అందించాడు.