టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆఫ్ ది ఫీల్డ్‌లో ఎంత చలాకీగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో సీరియస్‌గా ఉన్నా.. మ్యాచ్ అనంతరం తనదైన పనులతో నవ్వులు పూయిస్తుంటాడు. టీచర్‌గా అవతారమెత్తి కుర్రాళ్లకు పాఠాలు కూడా చెబుతుంటాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధోనీ చేసిన పని అందర్నీ నవ్విస్తుంది.
లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోనీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే మ్యాచ్ గెలిపించిన తర్వాత స్టంప్స్‌ను తీసుకెళ్లడం ధోనీకి అలవాటు. కానీ ఈ సారి ధోనీ.. స్టంప్స్‌ను కాకుండా ఐపీఎల్ డాగ్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారంలో సరికొత్త అనుభూతిని అందించేందుకు బీసీసీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో రూపొందించిన రోబోట్ డాగ్‌ను ఆదివారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బ్రాడ్‌కాస్టింగ్ టీమ్‌లో చేరిన రోబో డాగ్‌ను ప్రముఖ కామెంటేటర్ డానీ మారిసన్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ముంబై, ఢిల్లీ జట్లు సాధన చేస్తున్న సమయంలో ఆటగాళ్లను ఈ రోబోట్ డాగ్ పలకరించింది.
అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. మారిసన్ వాయిస్ కమాండ్‌లకు తగ్గట్టుగా ఫీట్లు చేసి అలరించింది. అతనితో పరుగు పందెంలో కూడా పాల్గొంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. టాస్ కాయిన్ అందించడంతో పాటు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఈ ఐపీఎల్ డాగ్ సందడి చేస్తోంది.
మంగళవారం లక్నో-చెన్నై మ్యాచ్‌లో ఈ ఐపీఎల్ డాగ్ అభిమానులను అలరించింది. మ్యాచ్‌కు ముందు ధోనీని ఈ ఐపీఎల్ డాగ్ పలకరించగా.. అతను దానితో కాసేపు ఆడుకున్నాడు. హాయ్ చెప్పినట్లే చెప్పి.. పక్కకు పడుకోబెట్టి పరుగెత్తాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ మ్యాచ్ అనంతరం.. ధోనీకి అడ్డంగా ఈ రోబోట్ డాగ్ వెళ్లగా అతను దాన్ని సంకలో పెట్టుకొని ఎత్తుకెళ్లాడు. ధోనీ సెన్సాఫ్ హ్యుమర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.