
మాంచెస్టర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి వన్డేలో విఫలమైనా.. కీలక రెండో వన్డేలో (3/34) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్కస్ స్టోయినిస్‌ను ఆర్చర్ ఔట్ చేసిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆర్చర్ బౌలింగ్ సామర్థ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది.
ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆర్చర్ వేసిన 8వ ఓవర్ ఐదో బంతిని మార్కస్ స్టోయినిస్ ఆడలేకపోయాడు. ఇంగ్లండ్ పేసర్ విసిరిన షార్ట్ పిచ్ బంతి అనూహ్యంగా శరీరంపై దూసుకురాగా ఏం చేయాలో తెలియక బ్యాట్‌ను అడ్డు పెట్టిన స్టోయినిస్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేవడంతో స్టోయినిస్(9) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 24 పరుగులతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన మోర్గాన్ సేన నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 రన్స్ చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(42), టామ్ కరన్(37), ఆదిల్ రషీద్(35 నాటౌట్) రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 207 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ ఆరోన్ ఫించ్(73), లబుషేన్(48) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
ఈ సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్ అయిన మూడో వన్డే మాంచెస్టర్ వేదికగా బుధవారం జరగనుంది.