న్యూజిలాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో తన స్టాన్స్ మార్చుకొని స్విచ్ హిట్‌తో బంతిని సిక్సర్ తరలించాడు.
ఈ వినూత్న షాట్‌కు మైదానంలోని ఆటగాళ్లతో పాటు కామెంటేటర్లు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వారెవ్వా ఫిలిప్స్ వాటే షాట్ అని కొనియాడుతున్నారు. ఇదేందయ్యా ఇది.. ఈ సిక్స్ ఏడా సూడలే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కెనడా బౌలర్ సాద్ బిన్ జఫర్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని ఫిలిప్స్ స్విచ్ హిట్‌తో డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా బౌండరీ తరలించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన ఈ బంతిని స్విచ్ హిట్ ద్వారా ఫిలిప్స్ అద్భుతంగా సిక్సర్‌గా మలిచాడు.
ఫిలిప్స్ స్టాన్స్ మార్చుకోవడం వల్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీ కాస్త అతనికి డౌన్ ది లెగ్ డెలివరీగా మారిపోయింది. దాంతో డీప్ ఎక్స్‌ట్రా కవర్ దిశగా ఫిలిప్స్ తన మణికట్టు బలాన్ని ఉపయోగించి ఫలితాన్ని రాబట్టాడు. బంతి నెమ్మదిగా రావడం కూడా అతనికి కలిసొచ్చింది.

ఫీల్డింగ్ వ్యూహాన్ని దెబ్బతీయడానికి చివరి నిమిషంలో ఫిలిప్స్ స్టాన్స్ మార్చుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్ కోసం పెట్టిన ఫీల్డింగ్‌ను ఈ స్విచ్ హిట్ ఛిన్నాభిన్నం చేసింది. బౌలర్ వైడ్‌గా బంతిని వేసి బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టాలని చూడగా.. స్విచ్ హిట్ ద్వారా ఆ వైడ్ బంతిని తనకు అనుకూలమైన లెగ్ సైడ్ బంతిగా మార్చుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బంతిని ఆఫ్ సైడ్ నుంచి దూరంగా తీసుకెళ్లాలని చూసినప్పుడు, ఎడమచేతి వాటం బ్యాటర్‌గా మారితే ఆ బంతి బాడీకి దగ్గరగా వస్తుంది. దీనివల్ల షాట్ ఆడటం సులువవుతుంది. పొట్టి క్రికెట్‌లో రాణించాలంటే ఇలాంటి వైవిధ్యమైన షాట్స్ ఆడాల్సిందే.
ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ సూపర్-8కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యువరాజ్ సమ్రా(65 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 110) సెంచరీతో రాణించగా.. కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా(39 బంతుల్లో 4 ఫోర్లతో 36) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫ్ఫీ, కైల్ జెమీసన్, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీసారు.
అనంతరం న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో 2 వికెట్లకు 176 పరుగులు చేసి మరో 29 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. రచిన్ రవీంద్ర(39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), గ్లేన్ ఫిలిప్స్(36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. కెనడా బౌలర్లలో డిలన్, సాద్ బిన్ తలో వికెట్ తీసారు. న్యూజిలాండ్ సూపర్-8 చేరడంతో కెనడాతో పాటు అఫ్గానిస్థాన్, యూఏఈ ఇంటిదారిపట్టాయి.