న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ , ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగే మాటల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్, ఇంగ్లండ్ జట్ల ప్రదర్శనలపై కామెంట్స్ చేస్తూ ఈ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు. ఇక టీమిండియా అంటే మైకేల్ వాన్ విద్వేషంతో రగిలిపోతాడు.
ఎప్పుడూ భారత జట్టుకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడుతుంటాడు. వాటికి వసీం జాఫర్ దిమ్మతిరిగే కౌంటరిస్తాడు. ఈ ఇద్దరి సోషల్ మీడియా వార్‌ను ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. అయితే గత కొంత కాలంగా సైలైంట్‌గా ఉన్న ఈ ఇద్దరూ.. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా మరోసారి వారల్లో నిలిచారు.

భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే సందర్భంగా మైకేల్ వాన్ ఆసక్తికర పోస్టు పెట్టాడు. ఎప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా పోస్టు పెట్టే వాన్.. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా ట్వీట్ చేశాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు లేకపోయినా.. కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు ఆసీస్‌పై మెరుగైన ప్రదర్శన చేస్తుందంటూ వాన్ కొనియాడాడు.
శుభ్‌మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్((105) సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు చేయడం ఖాయమే అని అంటూ.. టీమిండియా 400 స్కోరు దిశగా అడుగులేస్తోందని కితాబిచ్చాడు. అంతటితో ఆగకుండా వన్డే ప్రపంచకప్ జట్టులో భారత్‌ను ఓడించే జట్టే విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు.
ఇక వైకేల్ వాన్ వరుస ట్వీట్లకు వసీం జాఫర్ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. అద్భుతంగా ఆడుతున్న టీమిండియాకు 'ఎవరి దిష్టి తగలొద్దు'అనే అర్థం వచ్చేలా మిరపకాయలు, నిమ్మకాయ, బొగ్గు ముక్క వేలాడదీసిన ఫొటోను వాన్ షేర్ చేశాడు. ఈ ఫొటోకు భారత్-ఆస్ట్రేలియా అనే హ్యాష్ ట్యాగ్ జత చేశాడు.
వసీం జాఫర్ ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాన్‌కు కౌంటర్ ఇవ్వడంలో వసీం జాఫర్‌ను కొట్టేవాడే లేడుపో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వాన్ పోస్టు చూడగానే.. వసీం జాఫర్ స్పందన కోసం ఎదురుచూశామని, తమ అంచనాలు అందుకున్నాడని కొనియాడుతున్నారు.