టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఈ క్రమంలోనే వామప్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వలేదని చెప్పాడు. మెగా టోర్నీలో టీమిండియా బుధవారం ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ నేపథ్యంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన వసీం జాఫర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతారనుకుంటున్నా. ఈ క్రమంలోనే వామప్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇవ్వలేదనిపిస్తోంది. రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ 3, 4 స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. ఫస్ట్ డౌన్‌లో ఆడినా.. అతను పొషించే పాత్ర ఏం మారదు. అతను దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తాడు. ఐపీఎల్ తరహాలోనే దూకుడుగా ఆడుతూ మంచి ఆరంభాలు అందిస్తాడు. టీ20 ప్రపంచకప్‌ల్లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. తాజా టోర్నీలోనూ ఆ జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో టీమిండియా విరాట్ కోహ్లీ లేకుండానే బరిలోకి దిగింది. సంజూ శాంసన్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేశాడు. అయితే ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలోనే సంజూ శాంసన్‌ను రోహిత్‌కు జతగా ఓపెనింగ్ చేయించారని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు.

ఈ వామప్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ అద్భుత హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు, ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో పాటు ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం దక్కనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే బరిలోకి దిగనున్నారు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.