న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి స్పెషల్ టాలెంట్ ఏం లేదని, ఆటపై ఉన్న మక్కువ, కష్టపడే తత్వమే స్టార్ ప్లేయర్‌గా మార్చిందని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన వసీం జాఫర్.. విరాట్ కోహ్లీతో పాటు వరల్డ్ కప్ టీమ్ కాంబినేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అండర్ 19 ప్రపంచకప్ విజయానంతరం టీమిండియాలోకి విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు, అతని బ్యాటింగ్‌లో చాలా లోపాలు కనిపించాయి. అతను చాలా కష్టపడి తన బలహీనతలను అధిగమించాడు. 2-3 ఏళ్ల తర్వాత గొప్ప ఆటగాడిగా మారిపోయాడు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను విరాట్ కోహ్లీ అధిగమిస్తాడని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. అయితే సచిన్ కంటే మెరుగైన ఆటగాడైతే విరాట్ కోహ్లీ కాదని స్పష్టం చేశాడు. ఈ తరం క్రికెటర్లలో మాత్రం విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని చెప్పుకొచ్చాడు.
'సచిన్ టెండూల్కర్ పూర్తిగా భిన్నమైన ఆటగాడు. అతను ప్రతిభావంతుడే కాకుండా చాలా కష్టపడ్డాడు. కానీ విరాట్ కోహ్లీ ప్రతిభావంతుడు కాదు. కేవలం అతని హార్డ్ వర్కే అతన్ని వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యేలా చేసింది. మెరుగైన ఆటగాడికి కావాల్సిన అన్ని పనులను విరాట్ చేశాడు. తనను తాను ఎంతో మార్చుకున్నాడు. ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారి భారత క్రికెట్ జట్టులో ఫిట్‌నెస్ విప్లవాన్ని తీసుకొచ్చాడు.
విరాట్ కోహ్లీ కంటే సచిన్ భిన్నమైన ఆటగాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ కూడా అంగీకరించాడు. 15-16 ఏళ్ల పసిప్రాయంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన సచిన్.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, వాల్ష్ లాంటి భీకర పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 24 ఏళ్లు పాటు ఆడిన సచిన్ 30 వేల పరుగులు చేశాడు. కాబట్టి సచిన్ భిన్నమైన ఆటగాడు. కానీ ఈ తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు.'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆసియాకప్ టోర్నీ కోసం సిద్దమవుతున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో చివరిసారిగా బరిలోకి దిగిన కోహ్లీ.. వన్డే సిరీస్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ 76, 121 పరుగులు చేశాడు.
ఆసియాకప్ 2023 కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నదమవుతున్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్యాంప్‌లో ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు యోయో ఫిట్‌నెస్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ఆగస్టు 30న ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.