
న్యూఢిల్లీ: ట్విటర్ వేదికగా తనను హేళన చేసిన ఓ అభిమానికి టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సోషల్ మీడియా వేదికగా మరో సెహ్వాగ్‌ను తలపిస్తున్న వసీం జాఫర్ తనదైన పోస్ట్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాల్లో చాలా చురుకుగా ఉంటున్న జాఫర్.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సాధించిన చారిత్రక విజయంపై కూడా స్పందించాడు. తనదైన శైలిలో ట్వీట్ చేస్తూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లపై వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
2018-19 పర్యటలోనే ఆసీస్‌ను వారి సొంతగడ్డపై కోహ్లీ సేన ఓడించి చరిత్ర సృష్టించగా.. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడంతో భారత్ విజయం సులువైందని కొందరు మాజీ క్రికెటర్లు తక్కువ చేసి మాట్లాడారు. అయితే ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ జాఫర్ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. 'ఈసారి ఏం సాకు చెబుతారు. పాంటింగ్, మెక్‌గ్రాత్, వార్న్ ఆడలేదంటారా?'అని వ్యంగ్యస్త్రాలు సంధించాడు.
ఇక ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ఓ అభిమాని జాఫర్‌ను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. 'వసీం జాఫర్ భారత్ తరఫున ఎన్ని మ్యాచ్‌లు ఆడారు. ఎప్పుడైన ఈ విషయం గురించి ఆలోచించారా?'అని హేళనగా ట్వీట్ చేశాడు. దీనికి జాఫర్ తనదైన శైలిలో బదులిచ్చి ఆ అభిమాని నోరు మూయించాడు. 'నేను కేవలం 31 టెస్ట్‌లు మాత్రమే ఆడాను ఫ్రెండ్. కానీ భారత జట్టు ఆడే ప్రతీసారి వారితో కలిసి ఆడుతున్నట్లే ఫీలవుతా. నేను కాదు ఈ దేశంలో కోట్ల మంది ప్రజలు ఇలానే ఫీలవుతారు.'అని చాలా తెలివిగా బదులిచ్చాడు.
ఇక వసీం జాఫర్ బదులు ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడుపో అని ఒకరంటే.. సెటైర్ల కింగ్ జాఫర్‌నే హేళన చేస్తాడా? అని మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక భారత్-ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా కూడా జాఫర్.. తుది జట్టులపై కోడింగ్ మేసేజ్‌లతో ట్వీట్ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు.
2000లో సౌతాఫ్రికాతో సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రారంభించిన జాఫర్.. మొత్తం 31 టెస్ట్‌లు ఆడాడు. 11 హాఫ్ సెంచరీలతో 1944 పరుగులు చేశాడు. ఇక చివరిసారిగా 2006లో సౌతాఫ్రికాతోనే బరిలోకి దిగాడు. ఫస్ట్ క్లాస్‌లో ఘనమైన రికార్డులున్న జాఫర్‌కు జాతీయ జట్టు తరఫు పెద్దగా అవకాశాలు రాలేదు.