హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఈ విజయంతో అంతరిక్ష చరిత్రలో ఇస్రో సరికొత్త చరిత్రను లిఖించింది. బుధవారం సాయింత్రం జాబిల్లిపై అడుగుపెట్టిన ల్యాండర్ విక్రమ్.. కొన్ని నిమిషాల్లోనే భూమిపై ఉన్న పర్యవేక్షణ కేంద్రంతో కమ్యూనికేట్ చేసింది.
బెంగళూరులోని ఈ కేంద్రానికి తాజాగా తీసిన చంద్రుడి ఫొటోలను పంపింది. ఈ ఫొటోలను ఇస్రో ట్విటర్ వేదికగా పంచుకోవడంతో వైరల్‌గా మారాయి.చంద్రుడి ఉపరితలం ఫొటోలపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు.

జాబిల్లి ఉపరితలాన్ని క్రికెట్ పిచ్‌గా ఊహించుకున్న వసీం జాఫర్.. 'కచ్చితంగా మొదట బ్యాటింగ్ తీసుకోవాల్సిన పిచ్ ఇది. ముగ్గురు స్పిన్నర్లు, ఒక సీమర్, ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగుతా'అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక చంద్రయాన్-3 సక్సెస్‌పై యావత్ క్రికెట్ లోకం సంతోషం వ్యక్తం చేసింది. బీసీసీఐతో పాటు పరువు క్రికెటర్లు ఇస్రోకు అభినందనలు తెలిపారు.
'చరిత్ర సృష్టించాం.. మిషన్ సక్సెస్‌ఫుల్'అని చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ఆసక్తిగా వీక్షిస్తున్న బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఫొటోను బీసీసీఐ పంచుకుంది.
చంద్రయాన్-3 సక్సెస్ చారిత్రాత్మక ఘట్టమని బీసీసీఐ సెక్రటరీ జైషా కొనియాడాడు. ఇస్రోకు అభినందనలు తెలియజేశాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తదితర ఆటగాళ్లు ట్విటర్ వేదికగా చంద్రయాన్-3 సక్సెస్‌ను కొనియాడారు.

'మామా వచ్చేశాం'అంటూ జాబిల్లిపై చంద్రయాన్-3 అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి భారత సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3-ఎం4 విజయవంతంగా భూకక్ష్యలోకి చేరింది. మరుసటి రోజు తొలిసారి దీని కక్ష్యను పెంచారు.
ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా ఐదుసార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తయిన వెంటనే చంద్రుడి దిశగా ప్రయాణానికిగానూ ఆగస్ట్ 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేర్చారు. క్రమంగా చంద్రుడికి చేరువ చేసి ఈ వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాంర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండర్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడదీసారు. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని దిగ్విజయంగా చంద్రుడిపై కాలుమోపారు.