అసలేం జరిగిందంటే..
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ బాదాడు. ఇక అప్పటి నుంచి విరాట్ ఇప్పటివరకూ మరో మూడంకెల స్కోర్ నమోదు చేయలేదు. దీంతో అతని బ్యాటింగ్ సగటు కూడా ఈ మధ్య తగ్గింది. ఈ క్రమంలోనే '7Cricket' అనే ఓ ఆస్ట్రేలియన్ వెబ్‌సైట్.. తాజాగా కోహ్లీ బ్యాటింగ్ సగటును ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పోల్చింది.
జాఫర్ దిమ్మతిరిగే కౌంటర్..
'స్టాట్ ఆఫ్ ది డే' అని పేర్కొంటూ.. 2019 నుంచి టెస్టుల్లో స్టార్క్ సగటు 38.63, కోహ్లీ సగటు 37.17 ఉన్నాయని వారి ఫొటోలతో సహా ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన జాఫర్ తనదైన శైలిలోనే నవ్వుతున్న ఎమోజీ జత చేసి మరింత దీటుగా జవాబిచ్చాడు. టీమ్‌ఇండియా యువ పేసర్ నవ్‌దీప్ సైని (53.50) వన్డే కెరీర్ బ్యాటింగ్ సగటు.. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్‌స్మిత్ (43.34) కన్నా మెరుగ్గా ఉందంటూ రీట్వీట్ చేశాడు. కోహ్లీ, స్టార్క్‌కు మధ్య పోలికపెట్టేందుకు సిగ్గుండాలని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. ఇక జాఫర్ రిప్లేకు భారత అభిమానులంతా ఫిదా అవుతున్నారు. తెగ నవ్వుకుంటూ లైకులు, షేర్లు చేస్తున్నారు.
రెండుసార్లు ఓడించినా..
ఇక సదరు వెబ్‌సైట్‌పై భారత క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై రెండు సార్లు ఓడించినా ఆస్ట్రేలియా జట్టుకు సిగ్గురాలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా కంటే భారత్ ఎంతో మెరుగైన జట్టని, టాప్ టీమ్ ప్లేయర్స్‌తో పోల్చుకోవడం ఆపి, చైనా, అమెరికా క్రికెట్ జట్లతో పోల్చుకోవాలని సెటైర్లు పేల్చుతున్నారు. టెస్ట్‌ల్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎకానమీ 2.88, స్టార్క్‌ది 3.32 అని, ఇంత మాత్రానా స్టార్క్ కంటే కోహ్లీ గొప్ప బౌలర్ అవుతాడా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అర్థం పర్థం లేని పోస్ట్‌లతో పరువు తీసుకోవద్దని చురకలంటిస్తున్నారు. వన్డే క్రికెట్‌లో చేజింగ్‌లోనే విరాట్ కోహ్లీ ఒక్కడే 26 సెంచరీలు బాదితే.. ఆస్ట్రేలియా మొత్తం కలిపి 25 శతకాలే చేసిందని విమర్శిస్తున్నారు.
గాయం నుంచి కోలుకొని..
కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, మూడో టెస్టుకు ముందు అతను తిరిగి నెట్స్‌లో సాధన చేయడంతో ఆ మ్యాచ్‌కల్లా ఫిట్‌నెస్ సాధిస్తాడని హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'మూడో టెస్టు వరకూ అన్ని రకాలుగా కోహ్లీ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. కసరత్తులు చేసుకోవడానికి అతనికి తగినంత సమయం దొరికింది. కేప్‌టౌన్‌లో నెట్ సెషన్స్ ద్వారా అతడు తిరిగి లయ అందుకుంటాడు. అతనితో మాట్లాడాక చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడనిపిస్తోంది' అని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక జనవరి 11 నుంచి ఇరు జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. తొలి టెస్ట్‌లో భారత్ విజయం సాధించగా.. గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా విజయం సాధించి మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.


Click it and Unblock the Notifications
