మతపరమైన అంశాలను క్రికెట్లోకి తీసుకురావడం బాధగా ఉంది: వసీం జాఫర్

ముంబై: దేశవాళీ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ టెస్ట్ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి కొద్దిరోజుల ముందే జాఫర్ ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సెలక్టర్లు, అసోసియేషన్ కార్యదర్శి.. పక్షపాతం కారణంగా అనర్హులు జట్టు ఎంపికవుతున్నారని ఆరోపిస్తూ జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే వసీం జాఫరే జట్టు సెలెక్షన్ విషయంలో పక్షపాతంగా వ్యవహరించాడని, ఓ వర్గానికి చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యమిచ్చాడని అసోసియేషన్ అధికారులు ఆరోపించారు.

స్లోగన్ కూడా మార్చి..
ఉత్తరాఖండ్ జట్టు కోచ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జాఫర్.. జట్టు స్లోగన్ కూడా మార్చడన్నారు. 'రామ్ భక్త్ హనుమాన్‌కీ జై'అన్న నినాదాన్ని 'గో ఉత్తరాఖండ్'గా మార్చాడని, కనీసం 'ఉత్తరాఖండ్ జై'అనేదానికి కూడా అంగీకరించలేదన్నారు. జై అనే పదమే వద్దన్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేయమని సూచించాడని, బయో బుబుల్‌లోకి గురువులు తీసుకొచ్చి ప్రార్థనలు చేశారని ఆరోపించారు.

అసత్య ఆరోపణలు..
ఈ ఆరోపణలను వసీం జాఫర్ ఖండించాడు. మతపరమైన అంశాలను క్రికెట్లోకి తీసుకురావడం బాధగా ఉందన్నాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తీసుకురావడం చాలా బాధ కలిగిస్తోంది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. జై బిస్టాను సారథిగా నియమించాలని అనుకున్నా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా.. ఇక్బాల్‌ను కెప్టెన్ చేయమని సూచించారు. సీనియర్ ఆటగాడైన అతనికి ఐపీఎల్ ఆడిన అనుభవం కూడా ఉందని చెప్పడంతో నేను సరేనన్నా.

అనుమతితోనే..
అలాగే బయో బబుల్‌ల్లోకి మత గురువులను తీసుకొచ్చానని, అక్కడ మేం నమాజ్ చేశామని సంఘం అధికారులు అంటున్నారు. అయితే నేనో విషయం స్పష్టం చేయాలనుకుంటున్నా. డెహ్రాడూన్‌లోని శిబిరం సందర్భంగా రెండు లేదా మూడు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు. నేను ఆయనను పిలవలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసం ఇక్బాల్ అబ్దుల్లా (ఉత్తరాఖండ్ ఆటగాడు) నాతోపాటు మేనేజర్ అనుమతి కోరాడు'' అని జాఫర్ చెప్పాడు. సాధన పూర్తయ్యాకే ప్రార్థనలు జరిగాయని, దీన్ని ఎందుకు ఇంత పెద్ద విషయం చేస్తున్నారో అర్థం కావట్లేదని చెప్పాడు.

రాజీనామా ఆమోదం..
గతేడాది మార్చిలో అన్ని ఫార్మాట్ల నుంచి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే వసీం జాఫర్ ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా నియమితులయ్యాడు. కానీ ఏడాదిలోపే తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాఫర్ రాజీనామాను ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (సీఏయు) అంగీకరించింది. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరాఖండ్ ఘోర ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచింది.
టీమిండియా తరపున 31 టెస్టులు ఆడిన జాఫర్.. 1944 పరుగులు చేశారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఐదు శతకాలు, 11 అర్ధ శతకాలు సాధించారు. రెండు వన్డేలు కూడా ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications