గెలికి తన్నించుకోవడం అంటే ఇదే.. కోహ్లీ తీరును తప్పుబట్టిన వసీం జాఫర్!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రీషెడ్యూల్ టెస్ట్ మూడో రోజు ఆటలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తప్పుబట్టాడు. కోహ్లీ అనవసరంగా తన నోటికి పని చెప్పాడని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌తో జానీ బెయిర్ స్టో రెచ్చిపోయాడని చెప్పాడు. కోహ్లీ స్లెడ్జింగ్ ముందు వరకు నిదానంగా ఆడిన బెయిర్ స్టో ఆ తర్వాత టీ20 తరహా బ్యాటింగ్‌తో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
తొలి 60 బంతుల్లో 13 పరుగులు చేసిన బెయిర్ స్టో.. తర్వాతి 80 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. 84 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును బెయిర్ స్టో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్ గండం తప్పించాడు.

గెలికి తన్నించుకోవడం..
కోహ్లీ, బెయిర్ స్టో వాగ్వాదంపై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో మాట్లాడిన వసీం జాఫర్ భారత మాజీ కెప్టెన్ తీరును తప్పుబట్టాడు. 'విరాట్ కోహ్లీ అనవసర స్లెడ్జింగ్ జానీ బెయిర్ స్టోను రెచ్చగొట్టిందని చెప్పవచ్చు. ఎందుకంటే అంతకుముందు వరకు బెయిర్ స్టో చాలా జాగ్రత్తగా ఆడాడు. ఎప్పుడైన కోహ్లీ అతన్ని గెలికాడో తనలోని ఫైర్‌ను బయటకు తీసాడు. ఇది మానవ సహజం కూడా.
ఎవరైనా గెలికితే.. ఆగ్రహానికి గురవ్వడం సాధారణమే. బెయిర్ స్టోకు కూడా కోహ్లీ స్లెడ్జింగ్ కోపాన్ని తెప్పించింది. అయితే బెయిర్ స్టో రాణించినా భారత బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్‌పై పట్టు బిగించేలా చేసారు. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు'అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీదే తప్పు..
మాజీ ఓపెనర్ డాషింగ్ ఓపెనర్ సైతం కోహ్లీ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కవ్వింపులతో చతేశ్వర పుజారాలా ఆడుతున్న జానీ బెయిర్ స్టో.. రిషభ్ పంత్‌లా ఉగ్రరూపం దాల్చాడని సెహ్వాగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేయక ముందు జానీ బెయిర్ స్టో స్ట్రైక్‌రేట్ 21. తర్వాత 150. పుజారాలా ఆడుతున్న బెయిర్ స్టో.. కోహ్లీ కవ్వింపులతో రిషభ్ పంత్‌లా చెలరేగాడు'అని సెహ్వాగ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

భారీ ఆధిక్యం దిశగా భారత్..
ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. కోహ్లి 20 పరుగులే చేసి నిష్క్రమించగా, మరో ఓపెనర్ చతేశ్వర్ పుజారా (139 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) వికెట్ల ముందు గోడలా నిలబడ్డాడు. హిట్టర్ రిషభ్ పంత్ (46 బంతుల్లో 30 బ్యాటింగ్; 4 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అండర్సన్, బ్రాడ్, స్టోక్స్ తలా ఒక వికెట్ తీశారు.

చెలరేగిన సిరాజ్..
అంతకుముందు ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్ బిల్లింగ్స్ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 257 పరుగులకు చేరగా... చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications