
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. ఈ ఓటమికి ఎలాంటి సాకుల్లేవని, టీమిండియా చేజేతులా విజయవకాశాలను చేజార్చుకున్నదని అభిప్రాయపడ్డాడు. ఈ టెస్టులో మూడు రోజుల పాటు ఆధిపత్యం చెలాయించిన భారత్ అనూహ్యంగా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో ఈ ఓటమిని విశ్లేషించిన వసీం జాఫర్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'ఈ టెస్టులో టీమిండియా ఓటమికి కారణం కచ్చితంగా బ్యాటర్ల వైఫల్యమే. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసేప్పుడు కొంచెం పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పిచ్ కూడా బ్యాట్‌కు అనుకూలంగా మారింది. కొంచెం నిలదొక్కుకుంటే భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉండేది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ కనీసం 350-400 స్కోరు చేసి ఉండాల్సింది. అప్పుడు ఈ మ్యాచ్ ఫలితం మరోలా విధంగా ఉండేది.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జో రూట్-బెయిర్ స్టో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.వారు ఆడిన విధానం ప్రశంసించదగినది. వాళ్లిద్దరూ ఈ టెస్టులో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లారు.'అని జాఫర్ చెప్పుకొచ్చాడు.
ఈ టెస్టులో టీమిండియా టాపార్డర్ సమిష్టిగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, పుజారా, హనుమా విహారి, కోహ్లి, శ్రేయస్ అయ్యర్ చేసిన పరుగులు 76.. రెండో ఇన్నింగ్స్ లో ఇదే జాబితాలో పుజారా ఒక్కడే కాస్త మెరుగ్గా (66) ఆడాడు. మిగిలినవారిది అదే పంథా. మిగతా నలుగురు రెండో ఇన్నింగ్స్ లో చేసిన రన్స్ 54. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ వైఫల్యంతో పాటు నాలుగో ఇన్నింగ్స్‌లో భారత బౌలింగ్ మరి పేలవంగా ఉందని విమర్శించాడు.