పాకిస్థాన్ పేసర్ హరిస్ రౌఫ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ విమర్శలు గుప్పించాడు. అతని కారణంగానే ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమిపాలైందని చెప్పాడు. అతను కాస్త కట్టడిగా బౌలింగ్ చేసుంటే భారత్‌పై పాకిస్థాన్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు. ఆదివారం జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఓడించిన సంగతి తెలిసిందే. ఒకే ఎడిషన్‌లో పాకిస్థాన్‌ను మూడు సార్లు ఓడించి టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ఓటమెరుగని జట్టుగా 9వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో హరిస్ రౌఫ్ 3.4 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మిగతా బౌలర్లంతా కలిపి 100 పరుగులిస్తే.. అతనొక్కడే 50 రన్స్ ఇచ్చుకున్నాడు. అతని వైఫల్యమే పాకిస్థాన్ కొంపముంచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వసీమ్ అక్రమ్.. హరిస్ రౌఫ్‌కు పలు ఘాటైన సూచనలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని, లేకుంటే ఆట నుంచి తప్పుకోవాలని హితవు పలికాడు.

'దురదృష్టవశాత్తూ హరిస్ రౌఫ్ బౌలర్‌గా రన్‌మెషీన్ అయ్యాడు. ముఖ్యంగా భారత్‌తో మ్యాచ్ అనగానే ధారళంగా పరుగులు ఇచ్చుకుంటున్నాడు. నేను ఒక్కడినే అతన్ని విమర్శించడం లేదు. దేశం మొత్తం అతన్ని తిట్టని తిట్లు తిడుతోంది. అతను టెస్ట్ ఫార్మాట్ ఆడటం లేదు. ఆటలోనూ మెరుగవ్వడం లేదు. కనీసం నాలుగు, ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లైనా ఆడాలి. రెడ్ బాల్ క్రికెట్ ఆడనప్పుడూ జట్టులో కొనసాగకూడదు.
పీసీబీ కూడా ఈ విషయంలో కఠినంగా ఉండాలి. రెడ్ బాల్ క్రికెట్ ఆడని ఆటగాళ్లను జట్టు నుంచి తీసేయాలి.'అని వసీమ్ అక్రమ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అతని వ్యాఖ్యలతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సైతం ఏకీభవించాడు. సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీ కూడా సరిగా లేదని వసీమ్ అక్రమ్ చురకలంటించాడు. అతని అనాలోచిత నిర్ణయాలు కూడా ఓటమికి కారణమయ్యాయని చెప్పాడు.
హరిస్ రౌఫ్ 15వ ఓవర్‌లో 17 పరుగులు ఇచ్చుకోవడం ఫైనల్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. 18వ ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చిన రౌఫ్.. ఆఖరి ఓవర్‌లో4 బంతుల్లో 12 పరుగులు ఇచ్చుకున్నాడు. 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ హరిస్ రౌఫ్ బౌలింగ్‌లోనే కోహ్లీ సిక్స్‌లు బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. అతని బౌలింగ్‌లో కోహ్లీ కొట్టిన సిక్స్‌లు ఆ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు భారత్‌పై ఆడిన ఏడు టీ20ల్లో హరిస్ రౌఫ్ 8.66 ఎకానమీ, 25.66 సగటుతో 231 పరుగులు సమర్పించుకున్నాడు. హరిస్ రౌఫ్‌పై భారత అభిమానులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 'ఆట తక్కువ.. ఎక్స్‌ట్రా ఎక్కువ'అని కామెంట్ చేస్తున్నారు.