ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వీడుతాడని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అన్నాడు. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడడని అభిప్రాయపడ్డాడు. ఇక రోహిత్ శర్మ కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడితే తనకు చూడాలని ఉందని తెలిపాడు.
గౌతమ్ గంభీర్ మెంటార్‌గా.. రోహిత్ శర్మ ఓపెనర్‌గా.. శ్రేయస్ అయ్యర్ సారథిగా ఉంటే కేకేఆర్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంటుందని, ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారుతుందని చెప్పాడు. ప్రస్తుతం వసీం అక్రమ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించింది. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను పక్కనపెట్టి హార్దిక్‌కు జట్టు పగ్గాలు అందజేసింది. ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా దుమారమే రేగింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆట కంటే ఈ కెప్టెన్సీ వ్యవహారమే హాట్ టాపిక్‌గా మారింది.
టీమ్ భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చినా.. రోహిత్ శర్మ అభిమానుల నిరసనలు ఆగలేదు. హార్దిక్ పాండ్యాను ఓ శత్రువులా చూస్తూ ట్రోల్ చేశారు. జట్టులోని ఆటగాళ్లు కూడా రెండు గ్రూప్‌లుగా విడిపోయినట్లు కనిపించింది. దాంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరకుండానే అందరి కన్నా ముందే ఇంటిదారిపట్టింది.
ఈ క్రమంలోనే అప్‌కమింగ్ సీజన్‌కు రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు ఆడడనే చర్చ మొదలైంది. పైగా వచ్చే ఏడాది మెగా వేలం జరగనుంది. ప్రతీ ఫ్రాంచైజీ నలుగురి కంటే ఎక్కువ ఆటగాళ్లను తీసుకునే అవకాశం లేదు. దాంతో ముంబై ఇండియన్స్‌ను రోహిత్ శర్మ వీడుతాడనే చర్చ జోరుగా సాగుతోంది.
ఓ ఇంటర్వ్యూలో ముంబై ఇండియన్స్ తర్వాత తాను ఆడాలనుకునే జట్టు కేకేఆర్ అని రోహిత్ శర్మ తెలిపాడు. దాంతో రోహిత్ కేకేఆర్ జట్టులోకి వెళ్తాడనే ప్రచారం జోరందుకుంది. తాజాగా రోహిత్ శర్మ గురించి ఓ చానెల్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. అతను కేకేఆర్ జట్టు తరఫు ఆడితే చూడాలని ఉందని చెప్పాడు.

'వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కు గుడ్ బై చెబుతాడని అనిపిస్తోంది. అతను కేకేఆర్ తరఫున ఆడితే చూడాలనుంది. రోహిత్ ఓపెనర్‌గా.. గౌతమ్ గంభీర్ మెంటార్‌గా.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఊహించుకుంటేనే కేకేఆర్ బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగినట్లు అనిపిస్తోంది.
ఈడెన్ గార్డెన్స్‌లో వారికి తిరుగుండదు. రోహిత్ శర్మ ఏ వికెట్‌పైన అయినా ఆడగలడు. అతను ఓ గొప్ప ప్లేయర్. రోహిత్‌ను కేకేఆర్ జెర్సీలో చూడాలని ఉంది.'అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.