
కరాచీ: ఇన్నాళ్లకు సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుంటే ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వెస్టీండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌తో చాలా రోజుల అనంతరం పాక్ గడ్డపై క్రికెట్ మొదలైంది. టీ20 ప్రపంచకప్ ముంగిట న్యూజిలాండ్ జట్టు.. భద్రతా కారణాలతో సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు తప్పుకుంది. ఇంగ్లండ్ సైతం పాక్‌లో పర్యటించలేమని చెప్పింది. ఇక మెగా టోర్నీ అనంతరం వెస్టిండీస్.. పాక్ పర్యటనకు రాగా.. మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది.
ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌కు ప్రేక్షకాదరణ అంతంతమాత్రంగానే ఉంది. భారత్ మాదిరే క్రికెట్ అంటే పడిచచ్చే పాక్ ప్రజలు.. ఈ సిరీస్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదు. మైదానాలకు వచ్చి అస్సలు చూడటం లేదు. దాంతో ప్రేక్షకుల గ్యాలరీలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వసీం అక్రమ్ తన అసంతృప్తిని ట్విటర్ వేదికగా తెలియజేశాడు.
'గత నెల రోజులుగా పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ వెస్టిండీస్‌తో కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులు లేకుండా మైదానమంతా బోసిగా కనిపించడం బాధాకరం. జనాలంతా ఎక్కడున్నారు? ఎందుకు రావడం లేదు?'అని వసీం అక్రమ్ ట్వీట్ చేశాడు. పాకిస్థాన్‌లో నెలకొన్న అభద్రతా కారణంగా ప్రజలు మ్యాచ్‌లకు రావడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్నే వసీం అక్రమ్ పరోక్షంగా ప్రశ్నించాడు.
ఈ మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన బాబర్ సేన.. 13 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ(3/26) మూడు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 రన్స్ చేసింది.
ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ( 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 38), ఇఫ్తిఖార్ అహ్మద్ (19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32), హైదర్ అలీ (34 బంతుల్లో 4 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. షాదాబ్ ఖాన్(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్(7) తీవ్రంగా నిరాశపరిచాడు. రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్ కింగ్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67), షెపర్డ్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) పోరాడిన ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లకు తోడుగా.. మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసీమ్, హ్యారీస్ రౌట్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల నామమాత్రపు చివరి టీ20 గురువారం జరగనుంది.