టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ తరం అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కొనియాడిన వసీమ్ అక్రమ్.. తన ఫేవరేట్ పేసర్ అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం అక్రమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
పాకిస్థాన్ పేసర్ షాహిన్ షా అఫ్రిది, ఇతర బౌలర్ల కంటే బుమ్రా ఎందుకు అత్యుత్తమ పేసరో వివరించాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రా అసాధారణ ప్రదర్శన కనబరుస్తాడని, అదే అతన్ని ప్రత్యేక బౌలర్‌గా నిలబెట్టిందని తెలిపాడు. తాను ఆడే సమయంలో వెస్టిండీస్ దిగ్గజం సర్ వీవ్ రిచర్డ్స్ అత్యుత్తమ బ్యాటర్ అని, ప్రస్తుతం విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని చెప్పుకొచ్చాడు.

బుమ్రా, కోహ్లీపై వసీం అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించడం ఇదే తొలిసారి కాదు. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగానూ ఈ ఇద్దరిని కొనియాడాడు. తాను ఆడే రోజుల కంటే బుమ్రా బంతిపై ఎక్కువ కంట్రోల్ చూపిస్తున్నాడని తెలిపాడు.
'ప్రస్తుతం బుమ్రా వరల్డ్ బెస్ట్ బౌలర్. బౌలర్లందరి కంటే అతను చాలా అగ్రస్థానంలో ఉన్నాడు. బంతిపై అతనికి ఉన్న కంట్రోల్, పేస్, వేరియేషన్స్ అద్భుతం. అతనో అద్భుతమైన బౌలర్. అతని బౌలింగ్ కనుల పండుగగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త బంతితో అతను నిప్పులు చెరుగుతాడు.
బుమ్రా ఎడమ చేతి వాటం బ్యాటర్‌కు అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ బంతి సీమ్‌తో హిట్ చేసినప్పుడు.. వైడ్ ఆఫ్ ది క్రీజు నుంచి వేసినప్పుడు.. బ్యాటర్ బంతి లోపలికి వస్తుందని భావిస్తాడు. అతను ఆ యాంగిల్‌లోనే ఆడే ప్రయత్నం చేస్తాడు. కానీ బంతి పిచ్ అయ్యి బ్యాటర్‌కు దూరంగా వెళ్తోంది.
చాలా సార్లు బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ల చేతుల్లో పడుతుంది. కుడి చేతి బ్యాటర్లకు కొత్త బంతితో నేను ఇలానే ఇన్‌స్వింగర్స్ వేసేవాడిని. కానీ కొన్నిసార్లు నాకు బంతిపై కంట్రోల్ తప్పేది. కానీ బుమ్రా మాత్రం కొత్త బంతితో పూర్తి కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తాడు.'అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం జస్‌ప్రీత్ బుమ్రా మైదానంలోకి అడుగుపెట్టలేదు.
వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో అతనికి రెస్ట్ ఇస్తున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్‌తో బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు.