రాజస్థాన్ రాయల్స్ వెటరన్ పేసర్ సందీప్ శర్మకు రావాల్సిన గుర్తింపు రాలేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నా.. అతను అనామక బౌలర్‌గా మిగిలిపోయాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో సందీప్ శర్మ సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
ఇప్పటి వరకు 7.93 ఎకానమీతో 10 వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 124 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సందీప్ శర్మ 7.86 ఎకానమీతో 134 వికెట్లు తీసాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణించిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.

అయితే అతని తల రాతో లేక దురదృష్టమో తెలియదు కానీ సందీప్ శర్మకు ఇతర బౌలర్లలా గుర్తింపు దక్కలేదు. దాంతో టీమిండియా తరఫున ఆడే అవకాశాన్ని కూడా అతను అందుకోలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అతను అన్‌సోల్డ్ ఆటగాడిగా కూడా మిగిలిపోయాడు. రీప్లేస్‌మెంట్ ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్ శర్మ.. సంచలన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడిన వసీం అక్రమ్.. సందీప్ శర్మ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. అతన్ని 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో తొలిసారి చూశానని చెప్పిన వసీం అక్రమ్ అతన్ని స్వింగ్ బౌలింగ్‌కు ఫిదా అయినట్లు తెలిపాడు. ఆ తర్వాత అతను తన బౌలింగ్‌లో యార్కర్లు, స్లోయర్ బాల్స్‌ను డెవలెప్ చేసుకున్నాడు. అయితే అతనికి రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదని చెప్పాడు.
'డెత్ ఓవర్లలో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. యార్కర్లతో పాటు స్లోయర్ బాల్స్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. కొత్త బంతితో స్వింగ్ కూడా రాబడుతున్నాడు. సందీప్ శర్మను నేను 2012 అండర్ 19 ప్రపంచకప్‌లో తొలిసారి చూశాను. అప్పుడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు.

అయితే అతనికి రావాల్సిన గుర్తింపు అయితే రాలేదు. చివరి ఓవర్లు బౌలింగ్ చేసేవారు స్పెషలిస్ట్ బౌలర్లు అవుతారు. ఎందుకుంటే అలా బౌలింగ్ చేసేవారు చాలా తక్కువగా ఉంటారు. డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ప్రత్యేకమైన నైపుణ్యం. అలాంటి స్కిల్ సందీప్ శర్మకు ఉంది. నేను ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పని చేసినప్పుడు సందీప్ శర్మ తరుచూ నాతో మాట్లాడేవాడు.
బంతితో ఎలా స్వింగ్ రాబట్టాలో అడిగి తెలుసుకునేవాడు. నేను నీ నైపుణ్యాలను మాత్రమే నమ్ముకొని సాధన చేయాలని, వికెట్లు తీయడంపైనే ఫోకస్ పెట్టాలని చెప్పేవాడిని. ప్రస్తుతం అతను స్లోయర్ బౌన్సర్‌తో పాటు ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ యార్కర్‌ను డెవలప్ చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు సందీప్ శర్మ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవ్వ లేదు. అతనికి అవకాశం ఇవ్వాల్సింది'అని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.