
కరాచీ: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, వసీం అక్రమ్ స్పందించారు. ధోనీ తన అభిమాన క్రికెటర్ అని వసీం అక్రమ్ ట్వీట్ చేయగా.. క్రికెట్ స్టోరీ చెప్పేటప్పుడు ధోనీ లేకుండా అది ఖచ్చితంగా పూర్తికాదని అక్తర్ ట్వీట్ చేశాడు. అనంతరం తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఓ ట్రిబ్యూట్ వీడియోను విడుదల చేశాడు.
'నా అభిమాన క్రికెటర్లలో ధోనీ ఒకడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అనామక ఆటగాడిగా వచ్చి భారత్‌కు టీ20, వన్డే ప్రపంచకప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మహీ ప్రత్యర్థులకు అస్సలు భయపడడు. అతని డేరింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. నీ మిగతా జీవితంలో కూడా ఇలానే దూసుకెళ్లు ధోనీ.'అని వసీం అక్రమ్ ట్వీట్ చేశాడు.
'అంతర్జాతీయ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ వీడ్కోలు పలికాడు. క్రికెట్ గురించి ఏదైనా స్టోరీ చెబితే ధోనీ లేకుండా అది ముగియదు. ఓ ట్రిబ్యూట్ వీడియోతో మీ ముందుకు వస్తా'అని అక్తర్ ట్వీట్ చేశాడు.
ఆ వీడియోలో అక్తర్ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో గొప్ప ఫినిషర్ అయినా.. ప్రత్యర్థి ఎవరూ.. బౌలర్ ఎవరనే విషయం అతనికి అవసరం లేదని, నిర్భయంగా బ్యాటింగ్ చేసేవాడని కొనియాడాడు. శ్రీలంకపై సిక్స్ కొట్టి ప్రపంచకప్ అందించడం క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుతమన్నాడు. సౌరవ్ గంగూలీ అందించిన జట్టు ధోనీ అద్భుతంగా వాడుకున్నాడని, తన సారథ్యంతో భారత్‌కు చిరస్మరణీయ విజయాలందించాడని తెలిపాడు. క్రికెట్ చరిత్రలో ధోనీ తన పేరును సువర్ణక్షరాలతో లిఖించుకున్నాడని, అతని భవిష్యత్తు కూడా ఇలానే కొనసాగాలని అక్తర్ ఆకాంక్షించాడు.
ఇక శనివారం రాత్రి ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ చెప్పిన విషయం తెలిసిందే. 'కెరీర్ ఆద్యంతం నన్ను ప్రేమించడంతో పాటు మద్దతుగా నిలిచిన మీ అందరికీ కృతజ్ఞతలు. రాత్రి 7.29 నుంచి ఇక నేను రిటైర్ అయినట్టుగా భావించండి' అని 39 ఏళ్ల ఈ మాజీ కెప్టెన్ ఇన్‌స్టా పోస్ట్‌లో క్లుప్తంగా పేర్కొన్నాడు. ఐపీఎల్ క్యాంప్ కోసం చెన్నైకి వచ్చిన ఓ రోజు తర్వాత ఈ నిర్ణయం రావడం గమనార్హం. అయితే ఈ అనూహ్య నిర్ణయంపై అభిమానులంతా షాకయ్యారు. ఇక భారత క్రికెట్ ముఖ చిత్రంగా ఎదిగిన ధోనీకి ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ఘన వీడ్కోలు పలికారు. సినీ, క్రీడా, రాజకీయా, వ్యాపార రంగాలవారు ధోనీ సేవలను గుర్తు చేసుకుంటున్నారు.