
చెన్నై: టీమిండియా యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు క్రికెట్ అంటే పిచ్చని అతని తండ్రి ఎం.సుందర్ అన్నారు. తొమ్మిదేళ్ల వయసులో తలకు దెబ్బతగిలి కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి క్రికెట్ ఆడాడని గుర్తు చేసుకున్నాడు. తన కొడుకుని ఎక్కువ మంది స్పిన్నర్‌గా భావిస్తారని, కానీ అతను మంచి బ్యాట్స్‌మన్ అని చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రారంభించిన సుందర్.. అరంగేట్రంలోనే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచిన సుందర్.. బ్యాటింగ్‌లో అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. శార్దూల్ ఠాకూర్(67)తో కలిసి 123 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి కష్టాల్లో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చాడు.
ఈ క్రమంలో తన కొడుకు సూపర్ పెర్ఫామెన్స్‌పై వాషింగ్టన్ సుందర్ తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. బాల్యం నుంచే అతడిలో పోరాటతత్వం ఉండేదని వివరించాడు. కాకపోతే అతను సెంచరీ చేయలేదనే బాధ మిగిలిపోయిందన్నాడు. 'వాషింగ్టన్‌కు తొమ్మిదేళ్లు ఉంటాయి. అండర్-14 అంతర్ పాఠశాల మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే సాధన చేస్తుండగా అతని తలకు గాయమైంది. ఐదు కుట్లు పడ్డా మరుసటి రోజే వెళ్లి 39 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. అతని సవాళ్లకు భయపడడని ఆ రోజే నాకు అర్థమైంది. ఐపీఎల్, టీ20ల్లో వాషింగ్టన్‌ను చూసినవాళ్లంతా అతన్ని ఆఫ్‌స్పిన్నర్‌గా భావిస్తుంటారు. అది నిజం కాదు. బ్యాటింగ్ పరంగా అతను అత్యంత ప్రతిభావంతుడని నా విశ్వాసం. సెంచరీ చేయనందుకు బాధపడ్డా. సిరాజ్ క్రీజులోకి రాగానే సుందర్ భారీ షాట్లు ఆడాడు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం అతనికి ఉంది' అని సుందర్ చెప్పుకొచ్చాడు.
శనివారం మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన తర్వాత వాషింగ్టన్ తనకు ఫోన్ చేశాడని సుందర్ చెప్పాడు. ' ఈ మ్యాచులో నువ్వు చేయాల్సిన పనింకా పూర్తవ్వలేదు. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్ చేయాలి. ఇదో అరుదైన అవకాశం. దీనిని కచ్చితంగా అందిపుచ్చుకోవాలని చెప్పాను' అని ఆయన వివరించారు.