
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్, సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌటవ్వడం టీమిండియా పతనాన్ని శాసించిందన్నాడు. గురువారం జరిగిన సెమీఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత్ అమ్మాయిలు మరోసారి ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఐదు టైటిళ్లతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో తిరుగులేని జట్టుగా నిలిచిన ఆసీస్‌పై గెలవాలంటే ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉత్తమంగా రాణించాలని తెలిసినా... హర్మన్‌సేన ఆ పని చేయలేకపోయింది.
అనవసర తప్పిదాలతో చేజేతులా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు పట్టలేక, మైదానంలో చురుగ్గా కదల్లేక, బ్యాటింగ్‌లో వికెట్లు పారేసుకుని చివరకు ఓటమికి తలవంచింది. ముఖ్యంగా ఫీల్డింగ్ సమయంలో ఆసీస్ కీలక బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం భారత ఓటమిని శాసించింది. ఈ పరాజయంపై స్పందించిన లక్ష్మణ్.. గెలుపు కోసం చివరి వరకు పోరాడినా.. ఓ చిన్న తప్పిదం మ్యాచ్ గతినే మార్చేసిందన్నాడు. అదే మ్యాచ్‌ను భారత్ నుంచి ఆసీస్ వైపు తిప్పేసిందని చెప్పుకొచ్చాడు.
'హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్‌దే విజయమని అంతా అనుకున్నాం. అయితే, టీమిండియాకు అదృష్టం కలిసిరాలేదు. ఆస్ట్రేలియా ఒక్కసారిగా పుంజుకోవడంతో మ్యాచ్ వారివైపు తిరిగింది. చివర్లో భారత్ త్వరగా వికెట్లను కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ రనౌట్ అవ్వడం టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలం కావడంతో టీమిండియా తీవ్ర నిరుత్సాహానికి గురైంది'అని వీవీఎస్ లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెత్ మూనీ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), మెగ్ లానింగ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీయగా..శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్(34బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52), జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 6 ఫోర్లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది.