
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని ధాటిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్లిష్ట స్థితులను సమన్వయం చేయడాన్ని విరాట్ ఆస్వాదిస్తాడని, అతని సక్సెస్‌కు అదే కారణమని ఈ హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో విరాట్ నయా రికార్డుపై మాట్లాడిన లక్ష్మణ్ భారత కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు.
'ప్రతీ సిరీస్‌లో విరాట్ ఆడిన విధానం, క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు అతను చూపించే దూకుడు అద్బుతం. నిజానికి ఓ దశలో విరాట్‌కు అదే పెద్ద సమస్య అవుతుందని భావించా. ఏదో ఓ దశలో అతని జోరు తగ్గుతుందని అనుకున్నా. కానీ కోహ్లీ క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లోనైనా ఫీల్డింగ్‌లోనైనా సరే అతని ఎనర్జీ లెవల్స్ తగ్గటం నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇక ఒత్తిడిలో ఆడటాన్ని విరాట్ బాగా ఎంజాయ్ చేస్తాడు. వన్డేలో అతను సాధించిన సెంచరీలు చూస్తే ఆ విషయం ఎవ్వరికైనా అర్థమవుతుంది. లక్ష్య చేధనలో ఉన్నప్పుడు ఏ బ్యాట్స్‌మన్‌పైన అయినా స్కోర్ బోర్డు ప్రెజర్ ఉంటుంది. కానీ కోహ్లీ ఆ ఒత్తిడిని ఎంజాయ్ చేస్తాడు. మరింత బాధ్యతగా మారిపోయి తనలోని బెస్ట్‌ను బయటకు తీస్తుంటాడు'అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో 63 పరుగులు చేసిన కోహ్లీ..12 వేల పరుగులను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా విరాట్ గుర్తింపు పొందాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ ప్రశంసల జల్లు కురిపించారు.