ఇదో అర్థం పర్థం లేని వాదన.. భారత జట్టుకు పనికిరాని చర్చ: వీవీఎస్ లక్ష్మణ్

న్యూఢిల్లీ: ఇతర జట్లలా ఆయా ఫార్మాట్లకు తగ్గట్లు వేర్వేరు కెప్టెన్లను నియమించడం భారత క్రికెట్‌కు సరిపోదని, ఆ వాదనలో అర్థం లేదని టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో అజింక్యా రహానే జట్టును విజయపథంలో నడిపించిన విషయం తెలిసిందే. దాంతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అతన్ని పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగించాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి.
అలాగే గతంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించాలనే వాదనలూ వినిపించాయి. సమయం వచ్చినప్పుడల్లా, భారత జట్టు ఓడినప్పుడల్లా కోహ్లీ కెప్టెన్సీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే స్ప్లిట్ కెప్టెన్సీ వాదన తెరపైకి వస్తుంది.

భారత్‌కు పనికిరాదు..
ఈ నేపథ్యంలోనే తాజాగా న్యూస్18 చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్‌మెన్ లక్ష్మణ్ ఈ వాదనపై స్పందించాడు. టీమిండియాలో ఫార్మాట్లను బట్టి కెప్టెన్లను నియమించే విధానం ఎందుకు పనిచేయదో వివరించాడు. అది ఇంగ్లండ్‌కు సరిపోయినట్లు భారత జట్టుకు కుదరదని స్పష్టం చేశాడు. 'విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతలను భారంగా భావించనంతవరకూ.. మూడు ఫార్మాట్లలో బాగా ఆడుతుంటే అతన్నే కెప్టెన్‌గా కొనసాగించాలి.

అందుకే ఇంగ్లండ్‌కు ఇద్దరు..
ఇంగ్లండ్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి జోరూట్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యూలర్ ఆటగాడు కాదు. మరొకటి ఇయాన్ మోర్గాన్ టెస్టు క్రికెటర్ కాదు. ఎవరైనా ఒక ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడుతూ.. అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఉంటే అతడినే కెప్టెన్‌గా కొనసాగించాలి. ఈ విషయంలో టీమిండియాను ఇంగ్లాండ్‌తో పోల్చలేం. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీని కాదని వేరొకరిని కెప్టెన్‌గా చేయాల్సిన అవసరం లేదు.'అని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు.

స్ప్లిట్ కెప్టెన్సీ వాదనే..
స్ప్లిట్ కెప్టెన్సీ వాదనే అర్థరహితమని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు. 'ఫార్మాట్లను బట్టి కెప్టెన్ల ఎంపిక అనే వాదనకు ఎలాంటి అర్థంలేదు. టీమిండియాను అద్భుతంగా తీర్చిదిద్దింది విరాట్ కోహ్లీ. ఆటపై అతనికుండే సానుకూల దృక్పథం, పాటించే నైతిక విలువలు ఈ తరం క్రికెటర్లకు స్ఫూర్తి నింపాయి. దాంతో టీమిండియా ఆటగాళ్లు క్రికెట్ పట్ల అంకితభావంతో ఆడుతున్నారు.
అలాగే రహానే, పుజారా, రోహిత్, అశ్విన్, ఇషాంత్, బుమ్రాలాంటి నైపుణ్యమున్న ఆటగాళ్లు ఒక బృందంలా ఉండటం విరాట్‌కు కలిసొచ్చింది. అయితే, కోహ్లీ లేనప్పుడు.. రోహిత్, రహానే తమ సారథ్య లక్షణాలతో జట్టును ముందుండి విజయపథంలో నడిపించారు. అంటే టీమిండియా నాయకత్వంలో నాణ్యమైన కెప్టెన్లు ఉన్నారని అర్థం' అని లక్ష్మణ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications