టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. తన సతీమణి ఆర్తి అహ్లవత్‌కు విడాకులు ఇచ్చాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండేళ్ల క్రితమే ఈ ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రానప్పటికీ గతేడాదిగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా వీరేంద్ర సెహ్వాగ్ చేసిన పోస్ట్ ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది. తన తల్లితో పాటు ఇద్దరు కొడుకులతో ఉన్న ఫొటోను షేర్ చేసిన సెహ్వాగ్.. 'దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దనః । దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్ నమోస్తుతే'అనే సంస్కృత శ్లోకాన్ని క్యాప్షన్‌గా పేర్కొన్నారు.
'దీపపు వెలుగే పరబ్రహ్మము, దీపపు కాంతియే విష్ణువు. ఈ దీపము నా పాపములను హరించును. ఆ దీపపు కాంతికి నా నమస్కారం.'అని చెప్పడమే ఈ శ్లోకం అర్థం. ఈ ఫ్యామిలీ ఫొటోలో ఆర్తి అహ్లవత్ లేకపోవడాన్ని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భాయ్ బాబీ ఎక్కడా? విడాకులు నిజమేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2004లో వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లావత్ వివాహం జరగగా వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ సెహ్వాగ్ ఉన్నారు. 2007లో ఆర్యవీర్ సెహ్వాగ్, 2010లో వేదాంత్ సెహ్వాగ్ పుట్టాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఢిల్లీ తరఫున ఏజ్ క్రికెట్ ఆడుతున్నారు. 20 ఏళ్లు సాఫీగా సాగిన వీరి సంసారంలోకి మరో వ్యక్తి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి.
సేహ్వాగ్ స్నేహితుడైన సదరు వ్యక్తి ఆర్తి అహ్లావత్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలిసే ఆర్తి అహ్లావత్‌ను సెహ్వాగ్ దూరం పెట్టాడని వార్తలు వచ్చాయి. సదరు వ్యక్తి ప్రస్తుతం బీసీసీఐలో కీలక పదవిలో ఉన్నాడని, అతనితో ఆర్తి అహ్లావత్ ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఎవరూ ధృవీకరించలేదు.
2023 ఏప్రిల్ 28న చివరిసారిగా ఆర్తి అహ్లావత్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసిన సెహ్వాగ్.. గతేడాది దీపావళి సందర్భంగా కూడా ఆమె లేకుండానే తల్లి, పిల్లలతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. అప్పుడే విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.