
న్యూఢిల్లీ: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. సజీవమైన గుండెను పిడికిట పిసికినట్టు గత రెండున్నర నెలలుగా బాధపెడుతున్న వలస కూలీల గాథలకు చలించిపోయాడు. కరోనా తెచ్చిన కష్టంతో ఊరుబాట పట్టిన వలస కూలీల కోసం వంటవాడిగా అవతారమెత్తాడు.
తన ఇంట్లోనే కుటుంబ సభ్యుల సహకారంతో స్వయంగా తానే వంట చేసి.. ఆ ఆహారాన్ని ప్యాక్ చేసి ఓ స్వచ్చంద సంస్థ ద్వారా ఆకలితో ఆలమటిస్తున్న వలస కూలీలకు అందజేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ డాషింగ్ ఓపెనర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అంతేకాకుండా కరోనాతో అల్లాడుతున్న అభాగ్యులకు అండగా నిలిచేందుకు సాయం చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.
'మన ఇంట్లో మనమే వంట చేసి.. ఆ ఆహారాన్ని ప్యాక్ చేసి ఆకలితో అలమటిస్తున్న వలస కూలీలకు అందజేస్తే దక్కే సంతృప్తి మరెక్కడా దొరకదు. మీరు కూడా ఈ సాయంలో భాగం కావాలనుకుంటే సెహ్వాగ్ ఫౌండేషన్‌కు మీకు తోచిన సాయం చేయండి'అని వీరూ ట్వీట్ చేశాడు.
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే సెహ్వాగ్ మొదటి నుంచి కరోనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ముఖ్యంగా ప్రభుత్వ నిబంధనాలు పాటించాలని పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఇక దేశంలో ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటీవ్‌ల సంఖ్య 1.6 లక్షలు చేరుకుంది. ఇక ప్రపంచంలోనే కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. వైరస్ కట్టడికి భారత ప్రభుత్వం కఠినంగా లాక్‌డౌన్ అమలు చేసినా ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరించింది. ప్రస్తుతం పాక్షిక లాక్‌డౌన్ అమలవుతుండగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.