
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్లు హర్బజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. భవిష్యత్తులో సత్తా చాటే ఆటగాళ్లు ఎవరా? అని జరిగిన చర్చలో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. స్టార్ స్పోర్ట్స్ 'నెక్స్ట్ సూపర్ స్టార్'అనే షోలో పాల్గొన్న సెహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ముందుగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో ఫాస్ట్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రాటుదేలుతాడని చెప్పాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే రవి బిష్ణోయ్ పేరు సూచించాడు. 'స్పిన్నర్లలో తదుపరి సూపర్ స్టార్ రవి బిష్ణోయ్. అతనికి రావాల్సిన పేరు రావడం లేదు. కానీ నేను అతడి ఆటను దగ్గర నుంచి గమనిస్తున్నా. అతనో విభిన్నమైన స్పిన్నర్. రాబోయే ఐదేళ్లలో బిష్ణోయ్ మరోస్థాయిలో ఉంటాడు.'అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
ఇక హర్భజన్ సింగ్ మాట్లాడుతూ..'నా వరకైతే ఫాస్ట్ బౌలర్ల గురించి చెప్పాలంటే అర్ష్‌దీప్ సింగ్. ప్రస్తుతం మనం చూస్తున్న అర్ష్‌దీప్ భవిష్యత్ లో సూపర్ స్టార్ గా ఎదగడం ఖాయం'అని బదులిచ్చాడు. వెంటనే సెహ్వాగ్ జోక్యం చేస్తూ మరే ఆటగాడు స్టార్ పేసర్‌గా ఎదగడా? పంజాబీ ప్లేయర్‌కే అవకాశం ఉందా? భవిష్యత్తు పంజాబ్ ఆటగాళ్లదేనా? అని సెటైరిక్‌గా ప్రశ్నించాడు.
దానికి హర్భజన్ బదులిస్తూ.. 'అలాంటి ఏం లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా రాణించే ఆటగాళ్లు ఉన్నారు. పంజాబ్ గురించి కాదు గానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది టాలెంట్ గురించి.. అది అర్ష్‌దీప్‌లో కావాల్సినంత ఉందని చెబుతున్నా.'అని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యింది.
అర్ష్‌దీప్ సింగ్ గత కొంతకాలంగా దేశవాళీతో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతున్నాడు. నిలకగా రాణించి గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పటివరకు అర్ష్‌దీప్.. భారత్ తరఫున 26 టీ20లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. 2022 టీ20 వరల్డ్ కప్‌లో కూడా మెరుగ్గా రాణించాడు. ఇక బిష్ణోయ్.. 10 టీ20లు, ఒక వన్డే ఆడాడు. టీ20లలో 16 వికెట్లు పడగొట్టాడు.