చెంపలేసుకొని ఆ రూ.25 కోట్ల ఆటగాడిని పక్కన పెట్టండి: వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతవుతున్న కోల్‌కతా నైటర్‌రైడర్స్(కేకేఆర్)పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రూ.25.20 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసినందుకు తప్పు ఒప్పుకోని చెంపలేసుకోవాలని చురకలంటించాడు.
బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌తో జట్టుకు ఒరిగేది ఏం లేదని, అతని స్థానంలో టీమ్ సీఫెర్ట్‌ను ఆడించాలని సూచించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో కామెరూన్ గ్రీన్‌ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన కేకేఆర్ మూల్యం చెల్లించుకుంటుంది. అతను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో జట్టుకు భారంగా మారాడు. దాంతో కేకేఆర్ రూ.25.20 కోట్లు పెట్టి అష్ట దరిద్రుడిని కొనుగోలు చేసిందని సొంత ఫ్యాన్సే విమర్శలు గుప్పిస్తున్నారు.
డబ్బు మొత్తం తగలెట్టారు..
మంగళవారం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. కేకేఆర్‌కు ఇది నాలుగో పరాజయం. ఇప్పటి వరకు ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్ గెలవలేదు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో కేకేఆర్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆ జట్టు గురించి క్రిక్‌బజ్ షోలో మాట్లాడిన సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

'మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉండి కూడా.. కేవలం కామెరూన్ గ్రీన్ కోసమే రూ.25.20 కోట్లు ఖర్చు చేసి ఈ ఆటగాళ్లను కొన్నారు. ఇప్పుడు కామెరూన్ గ్రీన్ జట్టుకు భారంగా మారిపోయాడు. గ్రీన్ విషయంలో కేకేఆర్ పరిస్థితి ముందు చూస్తే నొయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్లుగా తయారైంది. గ్రీన్ ఆడిస్తనేమో అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆడించకపోతే రూ.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసి బెంచ్‌పై కూర్చోబెట్టారని జనాలు విమర్శిస్తారు.
తప్పైందని చెంపలేసుకోండి..
కానీ పొరపాటును అంగీకరించడంలో తప్పు లేదు. కామెరాన్ గ్రీన్ కోసమే భారీగా ఖర్చు చేసి తప్పు చేశామని నిజాయితీగా ఒప్పుకోండి. అతన్ని పక్కన పెట్టి మరొకరికి అవకాశం ఇవ్వండి. అతని బౌలింగ్ వల్ల కూడా జట్టుకు పెద్దగా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. పైగా అతని బ్యాటింగ్ , బౌలింగ్ వల్ల టీమ్ కాంబినేషన్ ఏమీ అద్భుతంగా మారిపోవడం లేదు.
అందుకే అతడిని బెంచ్‌కే పరిమితం చేసి.. గ్రీన్ స్థానంలో టిమ్ సీఫెర్ట్‌ను ఆడించాలని చెబుతున్నా. ఇటీవల న్యూజిలాండ్ తరపున అతను అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్‌తో కలిసి టిమ్ సీఫెర్ట్ దూకుడుగా ఆడాడు. ఈ ఇద్దర్నీ జట్టులోకి తీసుకొని ఓపెనింగ్ చేయించండి. ఆ తర్వాత అజింక్యా రహానేను మూడో స్థానంలో, పొవెల్‌ను నాలుగవ స్థానంలో ఆడించండి. రఘువంశీని కాస్త లోయరార్డర్‌లో పంపించండి. అప్పుడు రహానే అవుట్ అయితే రఘువంశీ రావడానికి వీలు ఉంటుంది. వేరే ఎవరైనా ఔట్ అయితే పొవెల్, రింకూ క్రీజులోకి రావచ్చు.'అని సెహ్వాగ్ సూచించాడు.
నెట్‌రన్‌రేట్ ఏం చేసుకుంటారు..?
కేకేఆర్ విజయం కోసం ప్రయత్నించకపోవడాన్ని కూడా సెహ్వాగ్ తప్పుబట్టాడు. గెలుపు కంటే నెట్ రన్‌రేట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడు. గెలిచిన పాయింట్స్ లేనప్పుడు నెట్‌రన్ రేట్‌తో ఏం చేసుకుంటారని చురకలంటించాడు. 'ఏ జట్టు అయినా పాయింట్లు సాధిస్తున్నప్పుడు మాత్రమే నెట్ రన్ రేట్ అనేది పరిగణనలోకి వస్తుంది.
అసలు పాయింట్లే లేనప్పుడు నెట్ రన్ రేట్ వల్ల ఉపయోగం ఏంటి? నేను ఆ సమయంలో అడ్డు చెప్పాలనుకోలేదు కానీ, పాయింట్ల పట్టికలో మీకు పాయింట్లు ఉండి, ఇతర జట్లతో పోటీ పడుతున్నప్పుడే రన్ రేట్ ముఖ్యం. అలా కాకుండా, స్వేచ్ఛగా ఆడండి. ఒకవేళ మీరు చిత్తుగా ఓడిపోయినా పర్వాలేదు. కనీసం మీరు ప్రయత్నించారని, గెలవాలనే తపన చూపించారనే సంతృప్తి ఉంటుంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications