న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఓవరాక్షనే ప్రధాన కారణమని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత సోమవారం జరిగిన ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి చివరి 2 బంతుల్లో 10 పరుగులు అవసరమవ్వగా.. రవీంద్ర జడేజా సంచలన బ్యాటింగ్‌తో 6, 4 బాది చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఈ ఫలితంపై మాట్లాడిన సెహ్వాగ్, గవాస్కర్.. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తప్పుబట్టారు.

చివరి ఓవర్‌ను మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. అనవసరంగా అతన్ని హార్దిక్, నెహ్రా డిస్టర్బ్ చేశారని తెలిపారు. ముందుగా సెహ్వాగ్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడ్డాడు. 'మోహిత్ శర్మ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ, యార్కర్లు వేస్తున్నప్పుడు...హార్దిక్ పాండ్యా అతని దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏం ఉంది?.
2 బంతుల్లో 10 పరుగులు కావాల్సినప్పుడు యార్కర్లు ఎలా వేయాలో మోహిత్ శర్మకు బాగా తెలుసు. హార్దిక్ వెళ్లి అనవసర సలహాలు ఇవ్వడం ఎందుకు?
హార్ధిక్ పాండ్యా వెళ్లి డిస్టర్బ్ చేయడం వల్లే మోహిత్ శర్మ రిథమ్ దెబ్బతిన్నది. అతన్ని అలాగే వదిలేసి ఉంటే కచ్చితంగా గుజరాత్ టైటాన్స్‌ను గెలిపించి ఉండేవాడు. కనీసం ఇంకో బంతి వేసేదాకా అయినా అతన్ని వదిలేసి ఉండాల్సింది.'అని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. 'మోహిత్ శర్మ మొదటి నాలుగు బంతులు అద్భుతంగా వేసాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో ఓవర్ మధ్యలో కోచ్ నెహ్రా నీళ్లు పంపించాడు. హార్ధిక్ పాండ్యా వచ్చి ఏదేదో చెప్పాడు. చక్కగా బౌలింగ్ చేస్తున్నప్పుడు మోహిత్ శర్మను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏం ఉంది.
నాలుగు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన అతనికి చివరి రెండు బంతులు ఎలా వేయాలో తెలియదా..? ఆ టైమ్ అతన్ని డిస్టర్బ్ చేయడం కోచ్ నెహ్రాతో పాటు హార్దిక్ పాండ్యా చేసిన తప్పు. చివరి రెండు బంతులు వేసేందుకు టైమ్ తీసుకోవడం చెన్నై బ్యాటర్లకు కలిసొచ్చింది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.