న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్, తన సహచరుడు రాహుల్ డ్రవిడ్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలిచాడు. టీమ్ విజయంలో ఆటగాళ్లదే కీలక పాత్రని, కోచ్‌ల ప్రమేయం అంతంత మాత్రమేనని తెలిపాడు. 2022 టీ20 ప్రపంచకప్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ విఫలమయ్యాడంటూ వస్తున్న విమర్శలను సెహ్వాగ్ తప్పుబట్టాడు.
ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని తెలిపాడు. 2011 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు హెడ్ కోచ్‌గా పనిచేసిన గ్యారీ కిరిస్టెన్.. అనంతరం చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించినా.. విజేతగా నిలపలేకపోయాడని గుర్తు చేశాడు. ఐసీసీ నిర్వహించిన వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సెహ్వాగ్.. ద్రవిడ్‌కు అండగా నిలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి మైదానంలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తే కోచ్‌ను అభినందిస్తారు. పేలవ ఆటతో ఓటమిపాలైతే విమర్శిస్తారు. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. కానీ టైటిల్ అందుకోలేకపోయింది. దాంతో ప్రతీ ఒక్కరూ పరాజయం గురించే మాట్లాడుతూ కోచ్‌ను నిందిస్తున్నారు.
కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం కూడా ఘనతే అనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. రాహుల్ ద్రవిడ్ ఉత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లే సరిగ్గా ఆడాలి. 2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు గ్యారీ కిరిస్టన్ కోచ్‌గా ఉన్నారు. ఆ టోర్నీ అనంతరం ఆయన చాలా జట్లకు కోచ్‌గా వ్యవహరించారు.
కానీ, ఒక్క జట్టును కూడా విజేతగా నిలపలేకపోయాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించినా.. అందులో ఆశిష్ నెహ్రానే ఎక్కువ కష్టపడ్డాడు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుకుంటాయని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉందన్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ ఉండే అవకాశం ఉందన్న సెహ్వాగ్.. వికెట్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ షమీ పోటీపడే అవకాశం ఉందన్నాడు.