కోహ్లీ ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడు.. మనమే ఎక్కువ ఆశించాం: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో విరాట్ హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. వాస్తవానికి విరాట్ ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నాడని చెప్పిన సెహ్వాగ్.. అతని నుంచి మనమే ఎక్కువగా ఆశించడం సమస్యగా మారిందని అభిప్రాయపడ్డాడు. ఇక ఈ సూపర్ 4 మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సెహ్వాగ్... కోహ్లీ ఆట తీరును విశ్లేషించాడు. క్రీజ్‌లోకి వచ్చిన ప్రతిసారి విరాట్ శతకం చేయాలని కోరుతున్నారని, అందువల్లే ఎన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా ఫామ్‌లో లేడనే వ్యాఖ్యలు వినిపించాయని వివరించాడు.

సెంచరీ కోసం చూసి చూసి..
'విరాట్ కోహ్లీ నుంచి ఎక్కువగా ఆశించాం. బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారి భారీ స్కోరు సాధించాలని.. కనీసం శతకం చేయాలని కోరుకున్నాం. సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడా..? లేదా? అని చర్చించుకున్నాం. ఎప్పుడైతే 40లు, 50ల్లోనే విరాట్ ఔట్ అవుతున్నాడో అప్పటి నుంచి కౌంట్ చేయడం మానేశాం. దీంతో అతను ఫామ్‌లో లేడని భావించాం. కానీ నాకు మాత్రం విరాట్ ఎప్పుడూ ఫామ్‌లోనే ఉన్నట్లు అనిపించాడు. అయితే మంచి ఆరంభాలను మాత్రం భారీ స్కోర్లుగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు.

విలువైన ఇన్నింగ్స్..
పాకిస్థాన్ మీద ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా విలువైంది. రోహిత్-రాహుల్ మంచి ఆరంభం ఇచ్చినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఈ సమయంలో ఇలాంటి అర్ధశతకం సాధించడం సాధారణ విషయం కాదు. ఒకవేళ కోహ్లీ కూడా త్వరగా ఔటైతే మాత్రం భారత్ స్కోరు బోర్డు 150 పరుగుల వద్దే ఆగిపోయేది. తక్కువ స్కోరుకే ఔటైతే బ్యాటర్ ఫామ్‌లో లేడు అని చెప్పొచ్చు. కానీ కోహ్లీ పరుగులు చేస్తున్నా శతకం మాత్రం చేయలేదు. అందుకే మన అంచనాలను అందుకోలేకపోయాడని చెబుతుంటాం. కానీ మనం ఏం ఆశిస్తున్నామో కోహ్లీకి ముఖ్యం కాదు'' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

దుమ్మురేపుతున్న కోహ్లీ..
ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విరాట్.. నెలరోజుల బ్రేక్ తీసుకొని ఆసియాకప్ బరిలోకి దిగాడు. రీఎంట్రీలో పాత కోహ్లీ తలపిస్తూ పరుగుల మోత మోగిస్తున్నాడు. వరుసగా రెండు అర్ధశతకాలు సాధించాడు. హాంకాంగ్‌పై 59, పాక్ మీద 60 పరుగులు చేసిన విరాట్ అంతకు ముందు కీలక 35 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఆసియా కప్ సూపర్-4లో భాగంగా మంగళవారం శ్రీలంకతో భారత్ తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications