
దాదాకే నా ఓటు..
ఇక దాదా అందించిన జట్టుతో ధోనీ అద్భుతాలు చేశాడు. యువ సారథిగా అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. ఆ తర్వాత 28 ఏళ్ల కలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచకప్ అందించి ఆ ఆనందాన్ని రెట్టింపుచేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకొని ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా గుర్తింపు పొందాడు. భారత క్రికెట్‌లో దాదా, ధోనీలది కీలక పాత్ర. అయితే, ఇదే విషయంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తన దృష్టిలో ధోనీ కన్నా సౌరవ్ గంగూలీనే అత్యుత్తమ సారథని చెప్పుకొచ్చాడు.

దూకుడు నేర్పించాడు..
'నా దృష్టిలో ధోనీ, దాదా ఇద్దరు గొప్ప సారథులు. ఎవరికి వారే ప్రత్యేకం. విపత్కర పరిస్థితుల్లో గంగూలీ టీమిండియాను ఏకతాటిపైకి తెచ్చాడు. నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేసి భారత్‌ను కొత్తగా తీర్చిదిద్దాడు. టీమిండియా విదేశాల్లో ఎలా గెలవాలో రుచిచూపించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జట్టుకు దాదా దూకుడు నేర్పించాడు. ముందుగా మేం టెస్టులు డ్రా చేయడం తెలుసుకున్నాం. ఆ తర్వాత గెలవడం నేర్చుకున్నాం' అని సెహ్వాగ్ '13 జవాబ్ నహీ' కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు.

మంచి జట్టుతో మహీ..
గంగూలీ రూపొందించిన జట్టుతో ధోనీ అద్భుతాలు చేశాడని సెహ్వాగ్ తెలిపాడు. కొత్త ప్రతిభావంతులతో భారత క్రికెట్లో సరికొత్త శకానికి నాంది పలికాడని ప్రశంసించాడు. 'ఎంఎస్ ధోనీకి అప్పటికే మంచి జట్టు దొరికింది. అందుకే కొత్త జట్టును రూపొందించాల్సిన సవాళ్లు అతడికి ఎదురవ్వలేదు. ఇద్దరూ గొప్ప కెప్టెన్లే అయినా నేనైతే దాదాయే అత్యుత్తమం అంటాను' అని ఈ డ్యాషింగ్ ఓపెనర్ చెప్పాడు. గంగూలీ, ఎంఎస్ ధోనీ ఇద్దరూ భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారు.

భారత్ క్రికెట్ ఎదిగిన తీరు..
ఇక దాదా బయోపిక్‌కు సంబంధించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గతంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీస్తే.. అది మాస్టర్ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని చూపిస్తుంది. అలాగే ధోనీ బయోపిక్‌లో మహీ ఎదిగిన విధానం మాత్రమే తెలుస్తోంది.
అదే గంగూలీ బయోపిక్ తీస్తే భారత జట్టు ఎదిగిన పరిస్థితులను చూపిస్తుంది'అని ఓ సందర్భంలో సెహ్వాగ్ కామెంట్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకొని అల్లాడుతున్న భారత క్రికెట్‌కు దాదా సారథిగా వెలుగులు నింపాడు. ఇంటలిజెన్స్ కెప్టెన్సీతో దూకుడైన నిర్ణయాలతో భారత క్రికెట్‌లో ఓ విప్లవం తీసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
