న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ దారుణంగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన 10 మ్యాచ్‌ల్లో కేవలం 184 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 18.40 ఉండగా.. స్ట్రైక్‌రేట్ 126.89గా ఉంది. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్‌కు పరిమితమైన రోహిత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌లుగా వెనుదిరిగాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రోహిత్ శర్మ చెత్త రికార్డు నమోదు చేశాడు.
అయితే రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. రోహిత్ బ్యాటింగ్‌లో ఎలాంటి టెక్నిక్ లేదని, అతని ఆలోచనా విధానంలోనే లోపం ఉందని స్పష్టం చేశాడు. ఈఎస్‌పీఎన్ క్రికెట్‌ఇన్‌ఫోతో మాట్లాడిన సెహ్వాగ్.. రోహిత్ శర్మ పేలవ ఫామ్‌కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'రోహిత్ శర్మ మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు. బౌలర్లతో కాకుండా తన వ్యక్తితత్వంతో ఆడుతున్నాడు. అతని ఆలోచనల్లో కాస్త గందరగోళం నెలకొంది. అతని బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎలాంటి లోపం లేదు. ఫామ్‌లోకి రావడానికి హిట్‌మ్యాన్‌కు ఒక్క ఇన్నింగ్స్ చాలు. అతను ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదు.'వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2016 సీజన్ నుంచి రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఆ సీజన్‌లో 129 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన రోహిత్.. గతేడాది 14 మ్యాచ్‌ల్లో 120.18 స్ట్రైక్‌రేట్‌తో 268 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేదు. అతని కెరీర్‌లో ఒక్క హాఫ్ సెంచరీ లేకుండా ఐపీఎల్ సీజన్‌ను ముగించడం అదే తొలిసారి.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ చెలరేగాలని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలుపొందింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఆర్‌సీబీపై ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.