అందరూ కోహ్లీలే.. గ్రౌండ్‌లో కంటే జిమ్‌లోనే గాయాలెక్కువ: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: మైదానంలో కంటే అతిగా జిమ్ చేయడం వల్లే టీమిండియా ఆటగాళ్లు ఎక్కువగా గాయపడుతున్నారని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) అన్నాడు. ప్రతీ ఒక్కడు విరాట్ కోహ్లీలా గంటల కొద్దీ జిమ్ చేస్తున్నారని, తమ శరీరానికి కావాల్సిన ఎక్సర్‌సైజులు చేయకుండా.. అధిక బరువులు ఎత్తుతూ వెన్నుగాయాలకు గురవుతున్నారని సెహ్వాగ్ ఆరోపించాడు. తమ హయాంలో ఏ ఒక్క క్రికెటర్ కూడా వెన్ను గాయానికి గురవ్వలేదని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్‌లు వెన్ను గాయాలతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ గాయాలు తిరగబెట్టడంతో ఆటకు దూరమయ్యారు. అయితే జిమ్‌లో అధిక బరువులు ఎత్తడం వల్లే భారత ఆటగాళ్లు వెన్ను గాయాలకు గురయ్యారని సెహ్వాగ్ ఆరోపించాడు. అసలు క్రికెటర్లకు బరువులెత్తాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించాడు.

వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు..?
ప్రముఖ యూట్యూబర్ 'ది రన్వీర్ షో'లో పాల్గొన్న సెహ్వాగ్.. భారత ఆటగాళ్ల గాయాలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'అసలు క్రికెటర్లు వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. క్రికెటర్లకు వెయిట్ లిఫ్టింగ్‌తో ఏం పని? ఈ బరువులను ఎత్తే బదులు ఆటను మెరుగుపరుచుకునే వ్యాయామాలు చేయవచ్చు కదా? బరువులు ఎత్తడం వల్ల కండరాలు ఫిట్ అవుతాయేమో గానీ గాయాలు కూడా అవుతాయి. శరీరం ఒత్తిడికి గురై నొప్పులు వస్తాయి. బరువులు ఎత్తడం క్రికెటర్లకు ఏ మాత్రం మంచిది కాదు.
మా తరంలో ఒక్కరు కూడా..
నేను క్రికెట్ ఆడే సమయంలో సచిన్, ద్రవిడ్, గంగూలీ, గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ, యువరాజ్ సింగ్, ఆకాశ్ చోప్రాల్లో ఏ ఒక్కరు కూడా వెన్ను గాయానికి గురవ్వలేదు. కనీసం తొడ కండరాల గాయంతో కూడా మ్యాచ్‌కు దూరం కాలేదు. కానీ ఇప్పుడు ప్రతీ క్రికెటర్ ఈ సమస్యతో బాధపడుతున్నాడు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ.. వీళ్లంతా వెన్ను నొప్పి బాధితులే. వీళ్లంతా మైదానంలో కంటే జిమ్‌లో గాయపడిన వారే.
అందరూ కోహ్లీలే..?
క్రికెటర్లు ఫిట్‌నెస్ పెంచుకోవడంలో తప్పులేదు. కానీ శరీర తత్వానికి అనుగుణంగా వ్యాయమం చేయడం మంచిది. మేం క్రికెట్ ఆడే రోజుల్లో ఏ క్రికెటర్ కూడా ఫిట్‌నెస్ కోసం బరువులు ఎత్తలేదు. అయినా రోజంతా క్రికెట్ ఆడాం. ఇప్పటికీ కూడా ఆడుతూనే ఉన్నాం. విరాట్ కోహ్లీ జిమ్‌లో గంటల కొద్ది బరువులెత్తాడని అందరూ అతన్ని అనుసరిస్తానంటే కుదరదు. ఎవరి శరీర తత్వానికి అనుగుణంగా వాళ్లు వ్యాయామాలు చేయాలి.'అని సెహ్వాగ్ సూచించాడు. టెస్ట్‌ల్లో ట్రిపుల్ సెంచరీ రికార్డును రోహిత్ శర్మ అధిగమిస్తాడని సెహ్వాగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications