
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఇంత సక్సెస్ సాధిస్తాడని అస్సలు ఊహించలేకపోయానని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అతని దూకుడు చూసి ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగడనుకున్నానని చెప్పాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్.. విరాట్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'విరాట్ కోహ్లీలో టన్నుల కొద్ది టాలెంట్ ఉంది. అది నాకు బాగా తెలుసు. అయితే అతను కెరీర్‌లో ఇంత సక్సెస్ సాధిస్తాడని అస్సలు ఊహించలేకపోయాను. అతనిపై ఇతరులకు నమ్మకం ఉన్నా.. నాకు మాత్రం అతను త్వరగానే కనుమరుగవుతాడనిపించింది. లసిత్ మలింగ ఓవర్‌లో ఫోర్లు బాదినా, 40 ఓవర్లలో 280 పరుగులు కావాల్సిన సమయంలో ఓ అద్భుత సెంచరీతో టీమిండియాని గెలిపించినా.. విరాట్ కోహ్లీ 75 సెంచరీలు చేసేంత దూరం వస్తాడని ఊహించలేదు. అతనికి అపార ప్రతిభ ఉన్నా.. దాన్ని ఉపయోగించుకునే సత్తా లేదని అప్పట్లో నాకు అనిపించింది.
అతని దూకుడైన ప్రవర్తన వల్ల కూడా ఇన్నేళ్లు క్రికెట్ ఆడతాడనే నమ్మకం కలగలేదు.
75 సెంచరీలు, 25 వేల అంతర్జాతీయ పరుగులు చేస్తాడని అస్సలు ఊహించలేదు. విరాట్ కోహ్లీ ఇంత ఎత్తుకు ఎదగడానికి అతని మానసిక బలమే ముఖ్య కారణం. నాతో పాటు తనను తక్కువ అంచనా వేసిన ప్రతీ ఒక్కరికీ అతను తన ఆటతో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీని చూస్తుంటే.. నాతో ఆడిన కుర్రాడు ఇంత సక్సెస్ సాధించాడా? అంటే ఆశ్చర్యం కలుగుతోంది. అతను ఇప్పటికి చాలా సాధారణంగానే ఉన్నాడు.
నా పక్కనే బ్యాటింగ్, ఫీల్డింగ్ చేస్తుండేవాడు. పార్టీలకు బాగా వెళ్లేవాడు. అతను ఈ స్థాయికి చేరడానికి కొత్తగా ఏమీ చేయలేదు. కానీ క్రమశిక్షణను బాగా అలవర్చుకున్నాడు. వ్యాయామం చేయడం, ఫిట్‌నెస్ కాపాడుకోవడం, పరుగులు చేయడం... ఈ మూడింటిపైనే ఫోకస్ పెట్టాడు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరు. ఎంతోమంది ప్లేయర్లు కోహ్లీతో పాటే వచ్చారు, ఆడారు, వెళ్లిపోయారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం సిమెంట్, ఇసుక, స్టీల్ అన్నీ తానే వేసుకుని తన భవంతిని అందంగా నిర్మించుకున్నాడు.'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.