ఢిల్లీ: భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఉత్కంఠ. ఎనలేని క్రేజ్. ఇరు దేశాల అభిమానులు టీవీల ముందే కూర్చుంటారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ - పాక్‌లు ఓకే గ్రూప్‌లో తలపడబోతున్నాయి. ఇది వచ్చే ఏడాది జూన్‌లో జరగనుంది.
పాక్ పైన భారత్ గెలిస్తే ఇక్కడి అభిమానులు టపాసులు పేలుస్తారు. మిఠాయిలు పంచుకుంటారు. పాక్‌లో మాత్రం తమ జట్టు ఓడిపోతే ఆ ఆగ్రహాన్ని టీవీల పైన చూపిస్తుంటారు. రోడ్లపైకి తెచ్చి టీవీలను పగలగొడుతారు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులకు ఓ సూచన చేశాడు.
అతను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. భారత్ చేతిలో పాక్ మరోసారి ఓడిపోతే ఆ దేశ అభిమానులు తమ తమ టీవీలను పగలగొట్టవద్దని హితవు పలికారు. పాక్ అభిమానులను సోదరులుగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు.

వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం లండన్‌లో విడుదల చేసింది.
దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్‌లతో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక పూల్ గ్రూప్‌లో ఉన్నాయి. ఇక పూల్ ఏ గ్రూప్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌తో పాటు భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్న సంగతి తెలిసిందే.