కుటుంబానికి దూరంగా ఉండలేకనే టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి చూపలేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే ఏదైనా ఐపీఎల్ టీమ్ కోచ్‌గా ఆఫర్ ఇస్తే మాత్రం చేస్తానని తన మనసులో కోరికను వెల్లడించాడు. టీమిండియా స్టార్ ఓపెనర్‌గా 15 ఏళ్ల పాటు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
అనంతరం కామెంటేటర్‌గా.. పంజాబ్ కింగ్స్ మెంటార్, సపోర్ట్ స్టాఫ్.. డైరెక్టర్ ఆఫ్ ది క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగిన సెహ్వాగ్.. 2017లో టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అప్పటి క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా నియమించింది.

ఆ తర్వాత మళ్లీ సెహ్వాగ్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోలేదు. ఆసక్తి కనబర్చలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందుకు గల కారణాన్ని వెల్లడించాడు. టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగానే తాను హెడ్ కోచ్ పదవికి ఆసక్తి చూపలేదన్నాడు. ఐపీఎల్ టీమ్‌కు కోచ్‌గా పనిచేయాలని ఉందని తెలిపాడు.
'అవకాశం వస్తే ఏదైనా ఐపీఎల్ టీమ్‌కు హెడ్ కోచ్‌గా పనిచేస్తాను. టీమిండియా హెడ్ కోచ్ పదవి మాత్రం చేపట్టలేను. ఎందుకంటే టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తే నేను మళ్లీ నా కుటుంబానికి దూరంగా ఉండాలి. ఇప్పటికే ఓ ఆటగాడిగా 15 ఏళ్ల పాటు ఇంటికి దూరంగా ఉన్నాను. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తే ఏడాదిలో 8 నెలలు ఇంటికి దూరంగానే ఉండాల్సి ఉంటుంది.
హెడ్ కోచ్ అయితే మళ్లీ ఇదే రిపీట్ అవుతుంది. నాకు 14, 16 ఏళ్ల వయసు గల పిల్లలున్నారు. వారికి నా అవసరం ఉంది. ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. ఒకరు ఆఫ్ స్పిన్నర్ అయితే.. మరొకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. వారికి నేను ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. వారితో మరింత గడపాల్సిన అవసరం ఉంది. నేను టీమిండియా హెడ్ కోచ్‌గా వెళ్తే వారిని ట్రైన్ చేయడం కష్టమవుతోంది. అదే ఐపీఎల్ టీమ్‌కు కోచ్‌గా పని చేస్తే మాత్రం నా పిల్లలతో ఉండటానికి ఎక్కువ సమయం దొరుకుతుంది.'అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.