భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ నిలిచాడు. అతను హెడ్ కోచ్‌గా ఉన్న రోజులను ఇప్పటికీ అభిమానులు చీకటి రోజులుగా భావిస్తారు. దానికి కారణం ఛాపెల్ వ్యవహరించిన వివాదాస్పద తీరే. ముఖ్యంగా భారత సీనియర్ ఆటగాళ్లతో గొడవలు, అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీని భారత జట్టు నుంచి తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత పార్లమెంట్‌ను స్థంభింప చేసింది. అతని ప్రయోగాలతో జట్టు కూడా తీవ్రంగా నష్టపోయింది. గంగూలీనే కాదు అప్పటి సీనియర్ ఆటగాళ్లందరితోనూ ఛాపెల్ గొడవ పెట్టుకున్నాడు. గ్రెగ్ ఛాపెల్ కోచింగ్ టైమ్ భారత క్రికెట్‌లోనే ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది.
తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్..ఛాపెల్‌తో గొడవ పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు. ఛాపెల్ తన మాటలతో తీవ్రంగా బాధపెట్టాడని తెలిపాడు. తన జీవితంలోనే ఒకరి మాటల వాళ్ల బాధపడిన సందర్భం అది మాత్రమేనని తెలిపాడు. రాహుల్ ద్రవిడ్ వచ్చి గొడవను ఆపాడని చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

'గ్రెగ్ ఛాపెల్ మాటలు నన్ను ఒకసారి తీవ్రంగా బాధపెట్టాయి. నిలకడలేమి ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న సమయంలో నా బ్యాటింగ్ గురించి ఛాపెల్ అనవసర వ్యాఖ్యలు చేశాడు. నా ఫుట్ వర్క్ సరిగ్గా లేదని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగాడు. పాదం కదపకుండా పరుగులు సాధించలేవన్నాడు. నేను వెంటనే.. 'గ్రేగ్.. నేను ఇప్పటికే 50 సగటుతో 6000 పరుగులు చేశాను'అని బదులిచ్చాను. దానికి ఛాపెల్ అది నాకు అనవసరం అన్నాడు.
దాంతో వాగ్వాదం పెద్దదవ్వగా.. ద్రవిడ్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత నేను బ్యాటింగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు.. మరోసారి గ్రెగ్ నన్ను రెచ్చగొట్టాడు. ఈ మ్యాచ్‌లో పరుగులు చేయకుంటే.. తదుపరి మ్యాచ్‌లో చోటు ఉండదని హెచ్చరించాడు. రెండో సెషన్ ముగిసే సరికి నేను 184 పరుగులు చేశాను. ఆ తర్వాత నేను.. రాహుల్ ద్రవిడ్‌తో..'నీ కోచ్‌ను నా దగ్గరికి రాకుండా చూసుకో'అని చెప్పాను.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. గ్రెగ్ ఛాపెల్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. 2007 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.