న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్‌లో పెద్దగా రాణించిందేం లేదని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వన్డే ప్రపంచకప్ తుది జట్టులో అతన్ని ఆడించాల్సిన అవసరం పెద్దగా లేదని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా కాంబినేషన్‌కు సంబంధించిన వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'టీమిండియా తుది జట్టులో సూర్యను ఆడించాల్సిన అవసరం పెద్దగా లేదు. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లతో మిలార్డర్ బలంగా ఉంది. ఆరో స్థానంలో కేఎల్ రాహుల్ ఆడనుండగా.. ఏడో స్థానంలో హార్దిక్ బరిలోకి దిగుతాడు. సూర్యకుమార్ యాదవ్‌ను ఈ రెండు పొజిషన్లలో ఆడించలేని పరిస్థితి.

ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు. పైగా లెఫ్టాండర్ కావడం అతనికి అడ్వాంటేజ్. హార్ధిక్ పాండ్యాను ఆరో బౌలర్‌గా ఆడించాలని అనుకుంటే,కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు హార్ధిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి ఏడో స్థానంలో రవీంద్ర జడేజా ఆడాల్సి ఉంటుంది..
శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసి నాలుగో స్థానానికి తనే సరైనోడినని నిరూపించాడు. కాబట్టి తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించలేని పరిస్థితి.
వన్డే ప్రపంచకప్‌లో విజయం సాధించాలంటే టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యం. ఇక సూర్యకుమార్ యాదవ్.. వన్డేల్లో ఇప్పటివరకు పెద్దగా రాణించిందేం లేదు.
సూర్య చివరి 15-20 ఓవర్లలోనే బ్యాటింగ్‌కు వస్తాడు. ఆ స్థానంలో తన టీ20 టాలెంట్‌తో స్కోరును బుల్లెట్ స్పీడ్‌తో పరుగెత్తించాలి. అయితే సూర్య చేసే పని, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ కూడా చేయగలరు. కాబ్టటి శ్రేయాస్ అయ్యర్, నాలుగో స్థానంలో ఆడితే సూర్యకుమార్ యాదవ్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. రిషభ్ పంత్ కోలుకుంటే అప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ మరింత జఠిలంగా మారుతుంది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. 8న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.