ఆసియా కప్ 2025లో భారత్‌ను గెలిపించేది అభిషేక్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీలేనని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఈ ముగ్గురే మ్యాచ్ విన్నర్లు అని తెలిపాడు. వీరి ప్రదర్శనే భారత విజయవకాశాలను ప్రభావితం చేయనుందని అభిప్రాయపడ్డాడు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ 2025 ప్రారంభం కానుండగా.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ బరిలోకి దిగుతోంది.
ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంపిక చేయగా.. శుభ్‌మన్ గిల్, బుమ్రా రీఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం దక్కలేదు. ఈ జట్టు ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. శుభ్‌మన్ గిల్ కోసం శ్రేయస్ అయ్యర్‌ను పక్కన పెట్టడం సరికాదని మాజీ క్రికెటర్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జట్టు గురించి అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌లో టీమిండియా గేమ్ ఛేంజర్స్ అభిషేక్ శర్మ, బుమ్రా, వరుణ్ చక్రవర్తీ అని చెప్పాడు.

'నా అంచనా ప్రకారం ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ గేమ్‌ఛేంజర్‌గా నిలుస్తాడు. బుమ్రా ఎప్పటికీ గేమ్ ఛేంజరే. మిస్టరీ బౌలింగ్‌తో వరుణ్ చక్రవర్తీ ఛాంపియన్స్ ట్రోఫీలోనే ప్రభావం చూపాడు. టీ20 ఫార్మాట్‌లోనూ అదే స్థాయిలో రాణించగలడు. ఈ ముగ్గురే తమ ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
టీ20 ఫార్మాట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చివరి సారిగా టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత అతను పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ మూడు మ్యాచ్‌లే ఆడాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతన్ని మూడు మ్యాచ్‌లకే పరిమితం చేశారు. ఐపీఎల్ 2025లో 12 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 6.67 ఎకానమీతో 12 వికెట్లు తీసాడు.
ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతేడాది జింబాబ్వేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తీ దుమ్మురేపుతున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తీ.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇప్పటి వరకు 18 టీ20లు ఆడిన వరుణ్ చక్రవర్తీ 7.02 ఎకానమీతో 33 వికెట్లు పడగొట్టాడు.